Mohit Sharma  Worst Record: గత  రాత్రి ఢిల్లీ  అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రెచ్చిపోయాడు.  ఆరంభంలో నెమ్మదిగా ఆడిన పంత్‌ క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత పాత పంత్‌ను గుర్తు చేశాడు. పంత్‌ 43 బంతుల్లో అయిదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ దెబ్బకి  గుజరాత్ టైటాన్స్‌ బౌలర్ మోహిత్ శర్మ పేరిట పరమ చెత్త  రికార్డు నమోదయ్యింది. ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మోహిత్  రికార్డుకు ఎక్కాడు. మొత్తం 4 ఓవర్లు వేసిన మోహిత్ ఏకంగా 73 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దాంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ బౌలర్‌ బాసిల్‌ థంపి రికార్డు బద్దలైంది. 2018 ఎడిషన్‌లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో థంపి 4 ఓవర్లలో వికెట్‌ తీయకుండా 70 పరుగులు సమర్పించుకున్నాడు.  ఆ చెత్త రికార్డు ఇప్పుడు మోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. నిజానికి ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్ ముందు వరకు మోహిత్‌ శర్మ పర్వాలేదనిపించాడు. ఢిల్లీ మ్యాచ్‌లోనే   తడబడ్డాడు భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

 

ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు..
1. మోహిత్ శర్మ - 0/73 (గుజరాత్ వర్సెస్ ఢిల్లీ- 2024)
2. బాసిల్ థంపి - 0/70 (హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు-2018)
3. యష్ దయాల్ -0/69 (గుజరాత్ వర్సెస్ కోల్‌కతా -2023)
4. రీస్ టాప్లీ - 0/68 (బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ -2024)
5. అర్ష్‌దీప్ సింగ్ - 0/66 - (పంజాబ్ వర్సెస్ ముంబై -2023)



గుజరాత్‌ పోరాడినా
225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 13 పరుగుల వద్ద కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ పెవిలియన్‌ చేరాడు. కానీ వృద్ధిమాన్‌సాహా, సాయి సుదర్శన్‌ గుజరాత్‌ను విజయం వైపు నడిపించారు. వీరిద్దరూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడడంతో భారీ స్కోరును ఛేదించే దిశగా గుజరాత్‌ పయనించింది. వృద్ధిమాన్‌ సాహా 25 బంతుల్లో 39 పరుగులు చేసి అవుటవ్వగా...సాయి సుదర్శన్‌ 39 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్‌ తేలిగ్గానే లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కానీ వీరు వెంటవెంటనే అవుటయ్యారు. తర్వాత ఒమ్రాజాయ్‌ ఒకటి, షారూఖ్‌ ఖాన్‌ ఎనిమిది, తెవాటియా నాలుగు పరుగులకే వెనుదిరగడంతో గుజరాత్ కష్టాల్లో పడింది. కానీ డేవిడ్‌ మిల్లర్‌ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 23 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. చివర్లో రషీద్‌ఖాన్‌ కూడా 21 పరుగులతో పోరాడాడు. చివరి ఓవర్‌లో 19 పరుగులు కావాల్సి ఉండగా కేవలం 14 పరుగులు మాత్రమే వచ్చాయి. తొలి అయిదు బంతుల్లో పదమూడు పరుగులు రాగా చివరి బంతికి అయిదు పరుగులు అవసరమయ్యాయి. కానీ ఒకే పరుగు రావడంతో గుజరాత్‌ నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రషీద్‌ ఖాన్‌ పోరాడినా గుజరాత్‌కు విజయాన్ని అందించలేకపోయాడు. 


మొదట్లో మోహిత్ శర్మ  డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా పేరొందిన విషయం తెలిసిందే. కానీ  ఈ మ్యాచ్ లో  మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు. తన తొలి ఓవర్లో 12.. రెండో ఓవర్లో 16 ఇచ్చాడు. ఇక మూడో ఓవర్లో 14 పరుగులు.. నాలుగో ఓవర్ అయిన  ఇన్నింగ్స్  చివరి ఓవర్ లో ఏకంగా 31 పరుగులు సమ్పర్పించుకున్నాడు.