Hyderabad Match : ఈరోజు ఉప్పల్ లో ఆర్సీబీ బౌలింగ్ ధాటికి సన్ రైజర్స్ వణికిపోవటం ఖాయం. సన్ రైజర్స్ 300 పరుగులకే ఆలౌట్ అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఏదో కాస్త కష్టపడితే సన్ రైజర్స్ 350-400 రన్స్ చేసే అవకాశం ఉంటుందికానీ లేదంటే ఆర్సీబీ బౌలర్లు ఈ సన్ రైజర్స్ బ్యాటర్లను వణికిస్తారు. వాళ్ల బౌలర్లు ఉన్న ఫామ్ కి సన్ రైజర్స్ ఈ సారి పవర్ ప్లేలోనే 200 కొడితే పర్లేదనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా మయాంక్ దాగర్, కర్ణ్ శర్మ స్పిన్ ఉచ్చులో క్లాసెన్ లాంటోడైనా చిక్కుకుని విలవిలాడాల్సిందే. అల్జారీ జోసెఫ్ బౌలింగ్ తో నిప్పులు విసిరితే అభిషేక్ శర్మ 30 బంతుల్లో సెంచరీకే పరిమితం కావచ్చు. లోకి ఫెర్గ్యూసన్ బౌలింగ్ లో ట్రావియెస్ హెడ్ 300 స్ట్రైక్ రేట్ కి మించలేకపోవచ్చు. ఇక ప్యాట్ కమిన్స్ సైలెన్స్ ని విరాట్ కొహ్లీ తట్టుకోలేక పెద్దగా అరుచుకోవచ్చు. ఇలాంటివి ఎన్ని ఎన్ని ఎన్ని దారుణాలో ఈ రోజు ఉప్పల్ మ్యాచ్ లో జరగొచ్చు.

  అటు సైడు ఫాప్ డుప్లెసీలు, కేమరూన్ గ్రీన్ లు, దినేశ్ కార్తీక్ విరాట్ కొహ్లీతో కలిసి యాజ్ యూజవల్ పోరాటాలు చేసుకున్నా రక్తపాతాలు పారించినా విజయానికి ఒక్క పరుగు దూరం వచ్చి బండిలో పెట్రోల్ అయిపోవటం ఖాయం కాబట్టి ఈసాలా కప్ నమ్మదే బోర్డు నెక్ట్స్ ఇయర్ కి దాచుకోవచ్చు. 


ఈ ఐపీఎల్‌(IPL 2024) సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH).. ప్రత్యర్థి జట్లను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తొలి బంతి నుంచి విధ్వంసంకర బ్యాటింగ్‌తో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ముంబైపై మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి రికార్డు సృష్టించిన హైదరాబాద్‌...బెంగళూరుపై మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి పాత రికార్డును బద్దలుకొట్టింది. ఢిల్లీపైన విధ్వంసకర బ్యాటింగ్‌తో 250కుపైగా పరుగులు సాధించింది. పవర్‌ ప్లేలో ఒక్క వికెట్‌ కోల్పోకుండా 125 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనే 300 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ అందుకుంటుందని అందరూ భావించారు. కానీ హైదరాబాద్‌ మిడిల్‌ ఆర్డర్‌ కాస్త తడబడడంతో ఈ ఛేదన సాధ్యం కాలేదు.


సొంతగడ్డపై హైదరాబాద్‌ను ఆపగలదా..?
హైదరాబాద్‌లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు దాడి చేసి  277 పరుగులు చేసి రికార్డు సృష్టించిన హైదరాబాద్‌.. తమ బ్యాటింగ్‌ గాలివాటం కాదని బెంగళూరు మ్యాచ్‌తో ప్రత్యర్థి జట్లకు చాటిచెప్పింది. అంతేనా ఢిల్లీతో మ్యాచ్‌లో అయితే ఈ విధ్వంసం పతాక స్థాయికి చేరింది. హెడ్‌ శతకంతో చెలరేగిన వేళ రికార్టులు కాలగర్భంలో కలిసిపోయాయి.ఇప్పటికే ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్‌ బ్యాటర్లు... ఇప్పుడు మిషన్‌ 300 స్టార్ట్‌ చేశారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో 300 పరుగుల మార్క్‌ను చేరుకుని ఐపీఎల్‌ 17 ఏళ్ల సీజన్‌లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలవాలని హైదరాబాద్‌ బ్యాటర్లు పట్టుదలతో ఉన్నారు. ఓ వైపు ట్రానిస్‌ హెడ్‌ విధ్వంసం... మరోవైపు అభిషేక్‌ శర్మ మెరుపు దాడి, క్లాసెన్‌, మార్క్రమ్‌ ఊచకోత, అబ్దుల్‌ సమద్‌, నితీశ్‌రెడ్డి తుపాను ఇన్నింగ్స్‌లతో హైదరాబాద్‌ జట్టుకు 300 పరుగుల మార్క్‌ సాధ్యమే అనిపిస్తోంది. పటిష్టమైన ముంబై బౌలర్లను ఎదుర్కొని 277 పరుగులు చేసిన హైదరాబాద్‌... బెంగళూరు బౌలింగ్‌నూ ఊచకోత కోసి 287 పరుగులు చేసింది. ఢిల్లీపైనా 250కుపైగా పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటికే మూడుసార్లు 250కుపైగా పరుగలు చేసిన హైదరాబాద్‌.. మరోసారి 300 పరుగుల లక్ష్యంపై కన్నేసింది. ముంబై జట్టులో బుమ్రా , బెంగళూరు జట్టులో సిరాజ్‌, ఢిల్లీ జట్టులోనూ టీమిండియా స్టార్ పేసర్లు ఉన్నా హైదరాబాద్‌ బ్యాటర్ల విధ్వంసం కొనసాగింది. మరోసారి హైదరాబాద్‌ టాపార్డర్‌... సునామీ సృష్టిస్తే అందులో 300 పరుగుల మార్క్‌ను చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. హైదరాబాద్ బ్యాటింగ్ తీరు చూస్తుంటే 300 పరుగుల రికార్డు బద్దలు కావచ్చని ఇప్పటికే మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. 300 పరుగుల మార్క్‌ను హైదరాబాద్‌ బద్దలు కొట్టవచ్చన్నాడు.