Ind Vs Eng 2nd Test Ravichandran Ashwin Eye On Few Records: అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలిటెస్టులో ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమి చవిచూసిన భారత జట్టు...విశాఖపట్నం వేదికగా నేటి నుంచి జరిగే రెండో టెస్టు కోసం సిద్ధమైంది. తొలిటెస్టులో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న టీమిండియాను గాయాల సమస్యలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు గాయాల కారణంగా KL రాహుల్‌, రవీంద్ర జడేజా దూరమయ్యారు. మూడేళ్ల క్రితం కూడా చెన్నైలో ఇంగ్లాండ్‌ చేతిలో తొలిటెస్టు ఓడిన టీమిండియా ఆ తర్వాత విజయాల బాటపట్టి టెస్టు సిరీస్‌ సొంతం చేసుకుంది. ఐతే ఈసారి జోరూట్‌ సేన నుంచి రోహిత్‌ సేన గట్టి పోటీ ఎదుర్కొంటోంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. కెరీర్‌లోనే కీలకమైన క్షణాలను విశాఖలోనే అందుకోవాలని అశ్విన్‌ భావిస్తున్నాడు.


500 వికెట్ల క్లబ్‌లో చేరుతాడా..?
ఈ మ్యాచులో అశ్విన్ మ‌రో నాలుగు విక‌ట్లు తీస్తే.. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఈ మైలురాయిని చేరుకున్న తొమ్మిదో ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. ప్రస్తుతం అశ్విన్ 96 టెస్టుల్లో 496 వికెట్లు తీశాడు. ఇందులో 5 వికెట్లు ప్రద‌ర్శన 34 సార్లు న‌మోదు చేశాడు. రెండో టెస్టు మ్యాచులో రెండు వికెట్లు తీసినా అశ్విన్‌ మరో రికార్డు సృష్టిస్తాడు. ఇంగ్లాండ్ పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా అశ్విన్‌ కొత్త చరిత్ర లిఖిస్తాడు. ఇప్పటి వ‌ర‌కు ఈ ఘ‌న‌త చంద్రశేఖ‌ర్ పేరిట ఉంది. చంద్రశేఖ‌ర్ 38 ఇన్నింగ్స్‌ల్లో 95 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆ త‌రువాత రెండో స్థానంలో అశ్విన్ ఉన్నాడు. అశ్విన్‌ 37 ఇన్నింగ్స్‌ల్లో 94 వికెట్లు సాధించాడు. వీరిద్దరి త‌రువాత మూడో స్థానంలో అనిల్ కుంబ్లే 92 వికెట్లతో ఉన్నాడు. ఇంగ్లాండ్ జ‌ట్టుపై ఇప్పటి వ‌ర‌కు ఏ టీమ్ఇండియా బౌల‌ర్ కూడా వంద వికెట్లు తీయ‌లేదు. అశ్విన్ ఇప్పటి వ‌ర‌కు ఇంగ్లాండ్ పై 94 వికెట్లు తీశాడు. అత‌డు మ‌రో 6 వికెట్లు గ‌నుక తీస్తే ఇంగ్లాండ్ పై వంద వికెట్లు తీసిన‌ మొద‌టి భార‌త బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టిస్తాడు. ఇక రెండు జ‌ట్ల మ‌ధ్య అత్యధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా జేమ్స్ అండ‌ర్స్‌న్ ఉన్నాడు. 66 ఇన్నింగ్స్‌ల్లో 139 వికెట్లు ప‌డ‌గొట్టాడు.
స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉంది. కుంబ్లే స్వదేశంలో 350 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. 56 టెస్టుల్లో 343 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మ‌రో 8 వికెట్లు తీస్తే కుంబ్లే రికార్డులు బ‌ద్దలు కొడ‌తాడు.
రూట్‌ సాధిస్తాడా..?
హైదరాబాద్‌(Hyderabad) వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్(Joe Root) అరుదైన రికార్డును సృష్టించాడు. భారత్‌పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో విదేశీ బ్యాటర్‌గా రూట్‌ నిలిచాడు. ఈ జాబితాలో రికీ పాంటింగి 2, 555 పరుగులు చేసి అగ్ర స్థానంలో ఉండగా... సరిగ్గా 2,555 పరుగులు చేసి జో రూట్‌ కూడా అదే స్థానంలో కొనసాగుతున్నాడు. రూట్‌ ఇంకొక్క పరుగు చేస్తే భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన విదేశీ క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. రూట్‌ను మరో రికార్డు కూడా ఊరిస్తోంది. రూట్ మరో 138 ప‌రుగులు చేస్తే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 19 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి ఇంగ్లాండ్ ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టిస్తాడు.