India vs England 2nd Test: అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ 2వ టెస్టుకు తమ జట్టును ప్రకటించింది . భారత్, ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. వైజాగ్లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ ప్రకటించిన తుది జట్టులో 2 మార్పులు చోటు చేసుకున్నాయి. గాయపడిన జాక్ లీచ్ స్థానంలో కొత్త స్పిన్నర్ షోయబ్ బషీర్ను తీసుకున్నారు. ఈ అన్‌క్యాప్‌డ్ ఆఫ్ స్పిన్నర్కి  అభినందనలు తెలిపింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.  ఇక మార్క్ వుడ్ స్థానంలో వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) జట్టులోకి వచ్చాడు.


మరోవైపు ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. తొలి టెస్టులో అనూహ్య పరాజయం పాలై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్‌ సేన... ఈ టెస్టులో గెలిచి మళ్లీ గాడిన పడాలని చూస్తోంది. రాహుల్‌, జడేజా గాయం కారణంగా రెండో టెస్ట్‌ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు జట్టు కూర్పు సమస్యగా మారింది. దేశవాళీల్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌(Sarfaraz Khan)కు భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. వైజాగ్‌(Vizag) వేదికగా ఇంగ్లండ్‌(England)తో జరగనున్న రెండో టెస్టుకు కేఎల్ రాహుల్(KL Rahul), రవీంద్ర జడేజా(ravindra jadeja) దూరం కానుండటంతో.. సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను బీసీసీఐ ఎంపిక చేసింది. రంజీల్లో టన్నుల కొద్ది పరుగులు చేసిన సర్ఫరాజ్‌కు అవకాశం ఇస్తూ ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బీసీసీఐ అతణ్ని కరుణించింది. రెండో టెస్ట్‌లో తుది జట్టులో చోటు దక్కితే రాణించి స్థానం పదిలం చేసుకోవాలని సర్ఫరాజ్‌ ఖాన్‌ పట్టుదలతో ఉన్నాడు. దేశవాళీలో సర్ఫరాజ్‌ 66 ఇన్నింగ్స్‌లో 69.85 సగటుతో 3912 పరుగులు చేశాడు. అందులో 14 సెంచరీలు, 11 అర్ధ శతకాలు ఉన్నాయి. 


టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో మొదటి ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగుల అధిక్యం సాధించి కూడా టీమిండియా ఓటమి పాలవడం ఇదే మొదటిసారి. విదేశాల్లో కలుపుకున్నా ఇది మూడోసారి మాత్రమే. 2015లో గాలె టెస్టులో శ్రీలంకపై మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 192 పరుగుల అధిక్యం సాధించింది. అయినా ఆ మ్యాచ్‌లో భారత జట్టు 63 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2022లో బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌‌తో జరిగిన టెస్టులో కూడా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 132 పరుగుల అధిక్యం సాధించింది. అయినా ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లండ్‌తో టీమిండియాకు ఎదురైన ఓటమి గత 12 ఏళ్లలో స్వదేశంలో మూడోది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ప్రధాన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా 100కు పైగా పరుగులు సమర్పించుకున్నారు. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో వీరిద్దరు 100కుపైగా పరుగులు సమర్పించుకోవడం ఇదే మొదటిసారి. అలాగే టెస్టు క్రికెట్‌లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ఓడిపోవడం కూడా ఇదే మొదటిసారి. 


ఇంగ్లాండ్ తుది జట్టు:
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్లో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫాక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్