SA Vs AFG Result Update: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికాకు శుభారంభం దక్కింది. కూన లాంటి ఆఫ్గానిస్తాన్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో 107 పరుగులతో ఘన విజయం సాధించింది. శుక్రవారం కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన గ్రూపు-బి లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సఫరీలు.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 315 పరుగులు చేశారు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ సూపర్ సెంచరీ (106 బంతుల్లో 103, 7 ఫోర్లు, 1 సిక్సర్)తో అద్భుతంగా రాణించాడు. బౌలర్లలో మహ్మద్ నబీకి రెండు వికెట్లు దక్కాయి. ఛేజింగ్ లో ఆఫ్గాన్ జట్టు ఏ దశలోనూ టార్గెట్ వైపు కదల్లేదు. 43.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ బ్యాటర్ రహ్మత్ షా (90) సత్తా చాటడంతో కనీస పోరాట పటిమ ప్రదర్శించింది. బౌలర్లలో కగిసో రబాడ 3, లుంగీ ఎంగిడి 2 వికెట్లతో ఆఫ్గన్ పతనాన్ని శాసించారు. రికెల్టన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. శనివారం చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇదే గ్రూపులో రెండో లీగ్ మ్యాచ్ జరుగుతుంది.
సూపర్ భాగస్వామ్యం..
ఆరంభంలో ప్రొటీస్ శుభారంభం దక్కలేదు. ఓపెనర్ టోనీ డి జోర్జి (11) త్వరగానే వెనుదిరిగినా, కెప్టెన్ టెంబా బవూమా (58) తో కలిసి జట్టును రికెల్టన్ ముందుకు నడిపించాడు. ప్రత్యర్థి బౌలర్లను సునాయసంగా ఎదుర్కొన్న ఈ జంట రెండో వికెట్ కు 129 పరుగులు జోడించారు. ఫిఫ్టీ తర్వాత బవూమా ఔటైనా రికెల్టన్ తన జోరును కొనసాగించాడు. 101 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతను ఔటయ్యాక రస్సీ వాన్ డర్ డస్సెన్ (52), ఐడెన్ మార్క్రమ్ (52 నాటౌట్)తో ఫిఫ్టీలతో చెలరేగారు. దీంతో ప్రొటీస్ ఆడుతూ పాడుతూ 300 పరుగులు మైలురాయిని అధిగమించింది. బౌలర్లలో ఫజల్ హక్ ఫరూఖీ, అజ్మతుల్లా ఒమర్ జాయ్, నూర్ అహ్మద్ లకు తలో వికెట్ దక్కింది.
వరుసగా వికెట్లు కోల్పోయి..
ఛేజింగ్ లో ఆఫ్గాన్ అద్భుతాలు ఏమీ చేయలేదు పటిష్టమైన ప్రొటీస్ బౌలింగ్ దళానిక తల వంచింది. మార్కో యన్సెన్, ఎంగిడి, రబాడలను ఎదుర్కోవడానికి ఆఫ్గాన్ బ్యాటర్లు తంటాలు పడ్డారు. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (10), ఇబ్రహీం జద్రాన్ (17), అటల్ (16), కెప్టెన్ హస్మతుల్లా డకౌట్, అజ్మతుల్లా (18) త్వరగా వెనుదిరగడంతో 89 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. రహ్మత్ షా పోరాటంతో జట్టు స్కోరు 200 పరుగుల మైలురాయిని చేరింది. మిగతా బౌలర్లలో మల్డర్ కి 2, కేశవ్ మహారజ్ , మార్కో యన్సెన్ కు ఒక వికెట్ దక్కింది. తాజా విజయంతో రెండు పాయింట్లను సాధించిన ప్రొటీస్ గ్రూపులో ఖాతా తెరిచింది.