South Africa pacer Kwena Maphaka made  history of U19 World Cup:  అండర్‌-19 వరల్డ్‌కప్‌(U19 World Cup)లో యువ తారలు దూసుకొస్తున్నారు. ఇప్పటికే భారత్‌ తరపున ముషీర్‌ ఖాన్‌(Musheer Khan) వరుస సెంచరీలతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికా బౌలర్‌ సరికొత్త చరిత్ర లిఖించాడు. అండర్‌ 19 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకూ ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డును సౌతాఫ్రికా పేస్‌ బౌలర్ క్వేనా మపాకా(Kwena Maphaka) నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన జరిగిన మ్యాచ్‌లో మసాకా ఆరు వికెట్లు నేలకూల్చి ఈ ఘనత సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో మసాకాకు ఇది మూడోసారి అయిదు వికెట్ల ప్రదర్శన. అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్‌ సింగిల్‌ ఎడిషన్‌లో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు చేయలేదు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీసిన మసాకా... వెస్టిండీస్‌పై 38 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన మపాకా 18 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. 17 ఏళ్ల లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అయిన మపాకా బుల్లెట్‌ వేగంతో నిప్పులు చెరిగే బంతులు సంధిస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లను నిశ్రేష్ఠులను చేస్తున్నాడు. ఇటీవలే జస్ప్రీత్‌ బుమ్రా కంటే వేగంగా యార్కర్లు సంధిస్తానని మసాకా సవాల్‌ కూడా చేశాడు.


ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే... 
మపాకా ఆరు వికెట్లతో చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా 119 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ప్రిటోరియస్‌ (71), రిలే నార్టన్‌ (41 నాటౌట్‌) రాణించారు. లంక బౌలర్లలో విశ్వ లహీరు, తరుపతి, వడుగే తలో రెండు వికెట్లు పడగొట్టారు. మమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక మపాకా ధాటికి 113 పరుగులకే కుప్పకూలి చిత్తుగా ఓడింది. మపాకా ఆరు, రిలే నార్టన్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.


చెలరేగుతున్న ముషీర్‌ 
ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో కదం తొక్కిన ముషీర్‌ ఖాన్‌ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ ముషీర్‌ నిలిచాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 81.25 సగటున 2 సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీలతో 325 పరుగులు చేశాడు.
రెండు శతకాలు.. ఒక అర్ధ శతకం
అండర్‌ 19 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌పై 118 పరుగులు చేసిన ముషీర్‌... న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 131 పరుగులు చేశాడు. ఈసెంచరీలతో ముషీర్‌ ఒకే ప్రపంచకప్‌ ఎడిషన్‌లో ఒకటికంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. టీమిండియా సీనియర్‌ ఆటగాడు శిఖర్‌ ధవన్‌ మాత్రమే సింగిల్‌ వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో రెండు సెంచరీలు చేశాడు. ఇప్పుడు రెండు సెంచరీలు చేసిన ముషీర్‌.. శిఖర్‌( Shikhar Dhawan) రికార్డును సమం చేశాడు. న్యూజిలాండ్‌పై సెంచరీతో ముషీర్‌ మరో ఘనతను కూడా సాధించాడు.