Smriti Mandhana Marriage Called off | క్రికెటర్ స్మృతి మంధానా, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ల వివాహం రద్దయింది. స్మృతి, పలాష్‌ల వివాహ వేడుకతో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచారు. నవంబర్ 23న జరగాల్సిన వివాహం చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. తాజాగా ఆ పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు స్మృతి స్వయంగా పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చారు.
స్మృతి మంధానా చేసిన పోస్ట్‌లో ఏమన్నారు..
గత కొన్ని వారాలుగా నా జీవితం గురించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో మాట్లాడటం అవసరమని భావిస్తున్నాను. నా జీవితాన్ని అలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. అయితే పెళ్లి రద్దయిందని నేను స్పష్టం చేస్తున్నాను.
'నేను పెళ్లి విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను. మీ అందరినీ అదే చేయమని కోరుతున్నాను. ఈ సమయంలో ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని మిమ్మల్ని కోరుతున్నాను. మమ్మల్ని ముందుకు సాగనివ్వండి. మనందరికీ ఒక గొప్ప లక్ష్యం ఉంటుందని నమ్ముతున్నాను, నా విషయంలో ఎల్లప్పుడూ నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం మాత్రమే. నేను వీలైనంత కాలం భారత్ కోసం ఆడాలని, ట్రోఫీలు గెలవాలని కోరుకుంటున్నాను. నా ఫోకస్ అంతా ఆటపైనే ఉంటుంది.' అని మంధాన తన పోస్టులో రాసుకొచ్చారు.
పలాష్ ముచ్చల్ కూడా పోస్ట్ చేశాడు
బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ సైతం తన పెళ్లి రద్దు కావడంపై స్పందించాడు. 'నా జీవితంలో ముందుకు సాగాలని, వ్యక్తిగత రిలేషన్‌లో వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఆధారాలు లేని పుకార్లపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారో చూసి చాలా బాధపడ్డాను, ఇది నా జీవితంలో కష్టమైన దశ. నేను ఈ పరిస్థితిని గౌరవంగా ఎదుర్కొంటాను. వదంతుల ఆధారంగా ఎవరినీ, సాక్ష్యాలు లేని వాటిని, మనం తీర్పు చెప్పే ముందు ఆగాలని నేను ఆశిస్తున్నాను. మన మాటలు ఇతరుల్ని గాయపరుస్తాయి. వాటి గురించి ఆలోచిస్తున్నప్పుడు, ప్రపంచంలో ఎంతమంది ఇలాంటి పరిణామాలను అనుభవిస్తున్నారో అనిపిస్తుంది. తప్పుడు వార్తలు, పరువు నష్టం కలిగించే విషయాలను ప్రచారం చేసే వారిపై నా టీమ్ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ కష్ట సమయంలో నాకు అండగా నిలబడిన వారికి ధన్యవాదాలు' చెబుతూ పలాష్ ముచ్చల్ పోస్ట్ చేశాడు.
పలాష్ ముచ్చల్, స్మృతి మంధాన నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సి ఉంది. వారి పెళ్లికి సంబంధించిన ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు జరిగాయి. ఆ తరువాత ఘనంగా హల్దీ వేడుక జరిగింది. మెహందీ, సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. కానీ అకస్మాత్తుగా పెళ్లిరోజు స్మృతి తండ్రికి ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వచ్చాయి. స్మృతి మంధాన తన తండ్రిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో స్మృతి, పలాష్‌ల పెళ్లి వాయిదా పడింది. ప్రస్తుతం తండ్రి ఆరోగ్యం ముఖ్యమని స్మృతి చెప్పారని సన్నిహితులు ఆ సమయంలో తెలిపారు. ఆ తరువాత పలాష్ మోసం చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ సమయంలో పలాష్ సైతం అస్వస్థతకు లోనై హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యాడు. పెళ్లి కచ్చితంగా జరుగుతుందని పలాష్ తల్లి కాన్ఫిడెన్స్‌గా చెప్పారు. కానీ చివరికి పెళ్లి వాయిదా వేసుకున్నట్లు పలాష్, స్మృతి ప్రకటించారు.