Smriti Mandhana News: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన రికార్డులు బద్దలు కొట్టడం తన అలవాటుగా మార్చుకుంది. గతవారమే ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలిచిన స్మృతి మంధాన.. తాజాగా గురువారం వెస్టిండీస్ తో జరిగిన చివరిదైన మూడో టీ20లో పలు ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఈ మ్యాచ్ లో 27 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన స్మృతి.. మహిళా క్రికెట్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ కు చెందిన సుజీ బేట్స్ పేరిట ఉండేది.
అత్యధిక పరుగుల రికార్డు..
అలాగే ఈ మ్యాచ్ లో 77 పరుగులు చేసిన స్మృతి.. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 పరుగులు సాధించిన క్రికెటర్ గా రికార్డులకెక్కింది. తాజా ఇన్నింగ్స తో ఈ ఏడాది 21 ఇన్నింగ్స్ లో 763 పరుగులు సాధించింది. గతంలో ఈ రికార్డు చమరి ఆటపట్లు (21 ఇన్నింగ్స్-720 పరుగులు) పేరిట ఉండేది. తాజా ఘనతలతో ఈ ఏడాది టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు గట్టి పోటీగా నిలిచింది.
టీ20సిరీస్ కైవసం..
ఇక ఈ మ్యాచ్ లో స్టాండిన్ కెప్టెన్ గా ఆడిన స్మృతి.. జట్టును విజయతీరాలకు చేర్చింది. దీంతో మూడు టీ20ల సిరీస్ ను 2-1తో భారత్ గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 217/4తో భారీ స్కోరు సాధించింది. ఈ ఫార్మాట్లో భారత్ కిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అలాగే ఈ సిరీస్ లో మంధానకిది వరుసగా మూడో అర్థ సెంచరీ కావడం గమనార్హం. అనంతరం చేజింగ్ విండీస్ ఓవర్లన్నీ ఆడి 157/7కే పరిమితమై 60 పరుగులతో ఓడిపోయింది. బ్యాటర్లో స్మృతి (47 బంతుల్లో 77, 13 ఫోర్లు, ఒక సిక్సర్) సత్తా చాటగా, రిచా ఘోష్ (21 బంతుల్లో 54, 3 ఫోర్లు, 5 సిక్సర్లు)తో వేగవంతమైన ఫిఫ్టీతో ప్రపంచ రికార్డును సమం చేసింది. కేవలం 18 బంతుల్లోనే తను అర్థ సెంచరీ సాధించడం విశేషం. విండీస్ బ్యాటర్ల చినెల్లి హెన్రీ (43) టాప్ స్కోరర్. బౌలర్లలో రాధా యాదవ్ నాలుగు వికెట్లతో విండీస్ నడ్డి విరిచింది. రిచా ఘోష్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, స్మృతికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.