Ravichandran Ashwin Father Sensational Comments: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతుండగా మధ్యలోనే రిటైర్మెంట్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. బుధవారమే ఆస్ట్రేలియా నుంచి బయలుదేరిన అశ్విన్ గురువారం భారత్‌కు చేరుకోగా.. చెన్నైలోని తన నివాసంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అశ్విన్ కారులోంచి దిగగానే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆయన్ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. అభిమానులు అతనిపై పువ్వులవర్షం కురిపించారు. తనకు సంబంధించినంత వరకూ ఈ రిటైర్మెంట్ పెద్ద విషయమేమీ కాదని.. తాను కొత్త మార్గాన్ని ఎంచుకోబోతున్నానని చెప్పాడు. 'నేను ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నా. సీఎస్కే తరఫున ఆడబోతున్నా. వీలైనంత ఎక్కువ కాలం చెన్నై తరఫున ఆడాలనుకుంటున్నా. క్రికెటర్‌గా నా కెరీర్ ముగియలేదు. భారత ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను.' అని అశ్విన్ స్పష్టం చేశాడు.


టీమిండియా ఘన వీడ్కోలు


రిటైర్మెంట్ అనేది అశ్విన్ ముందే తీసుకున్న నిర్ణయమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. మొదటి టెస్టు అయిన పెర్త్ మ్యాచ్ తర్వాతే అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని కానీ కీలకమైన డే అండ్ నైట్ టెస్ట్ అయిన అడిలైడ్ మ్యాచ్ వరకూ ఉండాలని తనే కన్విన్స్ చేశానని చెప్పుకొచ్చాడు. అశ్విన్‌కి రిటైర్మెంట్ సందర్భంగా గ్రాండ్‌గా వీడ్కోలు పలికింది టీమిండియా. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లంతా చాలా ఎమోషనల్‌గా అశ్విన్ లాంటి లెజెండ్‌కు సెండ్ ఆఫ్ ఇచ్చారు. అశ్విన్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కొంతమంది ఇక్కడ గ్రాండ్ సెలబ్రేషన్స్‌తో రిసీవ్ చేసుకున్నారు. 


తండ్రి సంచలన వ్యాఖ్యలు


కాగా, అశ్విన్ రిటైర్మెంట్‌పై తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 'మా అబ్బాయి మాత్రం ఎన్నాళ్లని ఆ మానసిక క్షోభను, వేదనను అనుభవిస్తాడు. అందుకే తట్టుకోలేక ఇక వద్దనుకున్నాడు' అని అన్నారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వటంతో అశ్విన్ దీనిపై స్పందించాడు. తన తండ్రికి మీడియాతో ఎలా మాట్లాడాలో తెలియదని... తనెప్పుడూ ఇలా మాట్లాడతాడని అనుకోలేదని.. అందరి నాన్నల్లా కొడుకు కోసం కామెంట్స్ చేసే టైప్ కాదనుకున్నానంటూ ఘటనను కవర్ చేశాడు అశ్విన్. తన తండ్రి మాటలను ఇష్యూ చేయకుండా వదిలిపెట్టేయాలని రిక్వెస్ట్ చేశాడు. అశ్విన్ రిటైర్మెంట్ ఆకస్మిక నిర్ణయం కాదని.. తుది జట్టులోకి తీసుకోకుండా తనను ఇబ్బంది పెడుతున్నందునే ఎమోషనల్‌గా డెసిషన్ తీసుకున్నాడంటూ రెండు రోజులుగా అతని ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్‌కు తండ్రి మాటలు కొండంత బలాన్ని ఇచ్చినట్లైంది.


Also Read: Aus Vs Ind Test Series: ఆసీస్‌కు దిమ్మతిరిగే షాక్ - గాయంతో స్టార్ పేసర్ సిరీస్‌కు దూరం, మెల్‌బోర్న్‌లో ఆడబోయేది ఆ ప్లేయరేనా?