SL vs NZ T20I: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న శ్రీలంక.. తమ పర్యటనలో తొలి విజయాన్ని అందుకుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలలో ఓడటంతో పాటు వన్డే వరల్డ్ కప్ క్వాలిఫై రేసులో నేరుగా అర్హత సాధించే అవకాశం కోల్పోయిన శ్రీలంక.. నేడు ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో మాత్రం సూపర్ విక్టరీ కొట్టింది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20.. టై అవడంతో ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా నిర్దేశించారు. సూపర్ ఓవర్ లో లంక సూపర్ విక్టరీతో అదరగొట్టింది.
ఆక్లాండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ జట్టులో కుశాల్ పెరీరా (45 బంతుల్లో 53, 4 ఫోర్లు, 1 సిక్సర్), అసలంక (41 బంతుల్లో 67, 2 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించారు. అసలంక, కుశాల్ లు నాలుగో వికెట్ కు 103 పరుగులు జోడించారు. చివర్లో వనిందు హసరంగ (11 బంతుల్లో 21 నాటౌట్, 2 సిక్సర్లు) రాణించారు.
ఛేదన సూపర్..
భారీ లక్ష్య ఛేదనకు వచ్చిన న్యూజిలాండ్ కూడా ధాటిగానే ఆడింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (0), చడ్ బోవ్స్ (2) లు విఫలమైనా కెప్టెన్ టామ్ లాథమ్ (27) తో కలిసి డారిల్ మిచెల్ (44 బంతుల్లో 66, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టును విజయపథం వైపు నడిపించారు. ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 63 పరుగులు జతచేశారు. లాథమ్ నిష్క్రమించాక మార్క్ చాప్మన్ (23 బంతుల్లో 33, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి మిచెల్ ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 66 పరుగులు జోడించారు. ఆఖర్లో రచిన్ రవీంద్ర (13 బంతుల్లో 26, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జేమ్స్ నీషమ్ (10 బంతుల్లో 19, 2 ఫోర్లు, 1 సిక్సర్) దంచికొట్టారు. ఆఖరి ఓవర్లో కివీస్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా ఆ జట్టు 12 పరుగులే చేసింది. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమమై సూపర్ ఓవర్ కు దారి తీసింది.
సూపర్ ఓవర్లో ఇలా..
సూపర్ ఓవర్ వేసేందుకు గాను లంక కెప్టెన్ దసున్ శనక.. బంతిని మహీశ్ తీక్షణకు ఇచ్చాడు. తీక్షణ.. 8 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత లంక బ్యాటర్ చరిత్ అసలంక.. రెండో బంతికి భారీ సిక్సర్, మూడో బంతికి ఫోర్ బాది లంక విజయాన్ని ఖాయం చేశాడు. ఈ విజయంతో శ్రీలంక.. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20.. ఈ నెల 5న డునెడిన్ వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే లంక ప్లేయర్లు వనిందు హసరంగ, మహీశ్ తీక్షణ లు ఐపీఎల్ లో తమ ఫ్రాంచైజీలతో కలుస్తారు.