Anantapur News: అనంతపురంలో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ మరోసారి డక్ అవుట్ అయ్యాడు. అనంతపురం స్పోర్ట్స్ విలేజ్ లో దులీప్ ట్రోఫీ మూడవ రౌండ్ మ్యాచ్‌లో భాగంగా ఇండియా బి టీంతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రేయస్ విఫలమయ్యాడు. దీపక్ చాహర్ వేసిన బంతిని ఫుల్ చేసేకి వెళ్లి నితీష్ కుమార్ రెడ్డి చేతికి చిక్కాడు. దీంతో కేవలం ఐదు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే శ్రేయస్ పెవిలియన్ చేరుకున్నాడు. 


ఇండియా డి టీంకు నాయకత్వం వహిస్తున్న శ్రేయస్ వరుసగా ఈ టోర్నీలో విఫలమవుతూ వస్తున్నాడు. భారత టెస్ట్ జట్టులో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నించాల్సిన టైంలో వరుసగా వైఫల్యాలు చెందుతూ ఉండడంతో భారత టెస్ట్ టీం లోకి వెళ్లేందుకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. శ్రేయస్ అయ్యర్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు రెండుసార్లు డక్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ టోర్నీలో వరుసగా అయ్యర్ చేసిన పరుగులు పరిశీలిస్తే 9, 54, 0, 41, 0. అంతకుమునుపు తమిళనాడులోని బుచ్చిబాబు టోర్నీలో శ్రేయస్ 2, 22 పరుగులు చేసి విఫలమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే భారత టెస్ట్ జట్టులో చోటు కోల్పోవడమే కాకుండా సెంట్రల్ కాంటాక్ట్‌లో చోటు కోల్పోయాడు. 




ఇలా అయితే చోటు కష్టమే


దులీప్ ట్రోఫీ శ్రేయస్ అయ్యర్‌కు ఎంతో కీలకం.. కానీ ఇలాంటి మ్యాచ్‌లలో నిలకడగా ప్రదర్శన చేయకపోవడంతో విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీకి ముందు 10 టెస్ట్ మ్యాచ్‌లు టీం ఇండియా ఆడాల్సి ఉంది. ఇప్పటికే బాంగ్లాదేశ్ 2 టెస్ట్ మ్యాచ్‌లు, ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్‌లు, న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. దులీప్ ట్రోఫీలో శ్రేయస్ అనుకున్న స్థాయిలో ప్రదర్శన చేసి ఉంటే న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కి అయిన సెలెక్ట్ అయి ఉండేవాడు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ పేలవ ప్రదర్శనతో టెస్ట్ జట్టులో చోటు కోల్పోవడం ఖాయమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఒక్కడై నిలబడ్డ శాశ్వత్‌


మరోవైపు ఇంకో మరో మ్యాచ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ ఇండియా సి టీంలో ఒక్కడు మాత్రం నిలిచాడు. తన బ్యాటింగ్ తో తన టీం అల్ ఔట్ కాకుండా చూడటమే కాకుండా సెంచరీ చేసిన శాశ్వత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఏ గ్రౌండ్‌లో మొదటగా టాస్ గెలిచి ఇండియా సి టీం ఫీలింగ్ ఎంచుకుంది. ఇండియా సి టీం ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఇండియా ఏ టీం ముందుగా బ్యాటింగ్ చేసింది. బ్యాటింగ్ ఆరంభించిన మొదటి సెషన్‌లోనే ఇండియా సి బౌలర్ల ధాటికి ఇండియా ఏ టీం కుప్పకూలింది. ఇండియా సి టీంలో బౌలర్ కాంబోజ్ దెబ్బకు ఇండియా ఏ టీం బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ బాట పట్టారు.


శాశ్వత్‌ రావత్‌  సెంచరీ : 
శాశ్వత్‌ రావత్‌ తనదైన శైలి బ్యాటింగ్‌తో గ్రౌండ్‌లో నలుమూలల బౌండరీలు సాధించి సెంచరీ చేశాడు. 235 బంతులు ఎదుర్కొన్న శాశ్వత్ 15 బౌండరీల సహాయంతో 122  పరుగులతో క్రీజ్‌లో నాటౌట్‌గా గెలిచాడు. ఐదో స్థానంలో వచ్చిన శాశ్వత్‌ రావత్‌కు ఒక్కరు కూడా సహకరించకపోయినా నిలకడగా బ్యాటింగ్ చేసి టీంను పటిష్ట స్థితిలో నిలిపాడు. 




ఇండియా ఏ, సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇండియా సీ జట్టు టాస్‌ నెగ్గి ఫీల్డింగ్‌ తీసుకుంది. ఇండియా సీ జట్టు బౌలర్ల ధాటికి ఇండియా ఏ జట్టు 36 పరుగులకే ఐదు కీలకమైన వికెట్లు కోల్పోయింది. ప్రతమ్‌ సింగ్‌ 6, కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ 6, తిలక్‌వర్మ 5, రియాన్‌ పరాగ్‌ 2, కుమార్‌ కుషగ్రా డకౌట్‌ అయ్యారు. ఈ దశలో శాశ్వత్‌రావత్, సామ్స్‌ ములానీ వికెట్‌ పడకుండా బాధ్యతాయుతంగా ఆడారు. ప్రధానంగా శాశ్వత్‌ రావత్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అవకాశం దొరికినప్పుడల్లా సింగిల్స్, డబుల్స్‌ తీసుకుంటూ.. బంతులను బౌండరీలుగా మలిచాడు. జట్టు స్కోర్‌ 123 పరుగుల వద్ద సామ్స్‌ ములానీ 44(5 ఫోర్లు, ఒక సిక్సర్‌) పరుగుల వద్ద అరో వికెట్ రూపంలో ఔట్ అయ్యాడు. ఈ దశలో శాశ్వత్‌ రావత్‌ దూకుడు పెంచాడు. ఈ క్రమంలో సెంచరీ సాధించాడు. ఆటముగిసే సమయానికి శాశ్వత్‌ రావత్‌ 235 బంతుల్లో 15 ఫోర్ల సహాయంతో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. అవేశ్‌ఖాన్‌ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఇండియా సీ జట్టు బౌలర్లలో అన్షుల్‌ కాంబోజ్‌ 3, విజయ్‌కుమార్‌ వైశాక్‌ 2 వికెట్లు తీసుకున్నాడు. 




పటిష్ట స్థితిలో ఇండియా డీ:
మరో మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన ఇండియా బి జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో ఇండియా డీ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది. 77 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్లు దేవదత్‌ పడిక్కిల్, శ్రీకర్‌ భరత్‌లు అర్ధసెంచరీలు చేశాడు. మొదటి వికెట్‌కు వీరు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 50 పరుగులు చేసిన పడిక్కిల్‌ను నవదీప్‌సైనీ పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్‌ శ్రీకర్‌ భరత్‌ 105 బంతులు ఎదుర్కొని 9 ఫోర్ల సహాయంతో 52 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఆంధ్ర ఆటగాడు రిక్కీ భుయ్‌ 87 బంతుల్లో 9 బౌండరీల సహాయంతో 56 పరుగులు చేశాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మరోసారి డకౌట్‌ అయ్యాడు. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన సంజు సామ్సన్‌ మెరుపులు మెరిపించాడు. అవకాశం దొరికినప్పుడు బంతిని సిక్సర్, బౌండరీగా మలిచాడు. 83 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 89 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. సరాన్స్‌జైన్‌ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. బీ జట్టు బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ 3 వికెట్లు పడగొట్టాడు. ముకేష్‌కుమార్, నవీదీప్‌శైనీ చెరో వికెట్‌ తీసుకున్నారు.