India vs Bangladesh, 1st Test Day 1: ఆ పోరాటం అసమాన్యం.. అద్భుతం. భారత క్రికెట్ చరిత్రలో స్టార్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్(Ashwin), రవీంద్ర జడేజా(Jadeja) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ చేతుల్లో నుంచి చేజారిపోతుందేమో అని భయపడుతున్న వేళ.. వీరిద్దరూ గోడలా నిలబడ్డారు. బంగ్లా(Bangladesh)కు మరో అద్భుతం చేసే అవకాశమే ఇవ్వకుండా టీమిండియా(India)ను భారీ స్కోరు దిశగా నడిపించారు. కీలక ఇన్నింగ్సులతో భారత్‌ను భారీ స్కోరు దిశగా నడిపించారు. 144 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్‌కు భారీ స్కోరు అందించారు.
నిలబడ్డారు..
భారత స్పిన్నర్లు చెలరేగారు. మాములుగా అయితే అశ్విన్-రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రాణించి టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపారని అనుకుంటారు చాలామంది. కానీ ఈసారి బంతితో కాదు బ్యాట్‌తో మెరిశారు ఈ స్టార్ స్పిన్నర్లు. తాము భారత జట్టుకు ఎంత కీలకమో మరోసారి చాటిచెప్పారు. బంతితో పాటు బ్యాట్‌తోనూ సత్తా చాటగలమని తేల్చి చెప్పారు. పాకిస్థాన్‌ను వారి దేశంలోనే మట్టికరిపించి.. భారత్‌కు షాక్ ఇవ్వాలని తహతహలాడుతున్న బంగ్లాదేశ్ జట్టుకు ముక్కుతాడు వేశారు. టాపార్డర్ బ్యాటర్లు అందరూ తక్కువ పరుగులకే పరిమితమై.. క్రికెట్ అభిమానులంతా ఆందోళన పడుతున్న వేళ తామున్నాం... నిలబడతాం.. పోరాడతాం అని భరోసా కల్పిస్తూ రవిచంద్రన్ అశ్విన్, జడేజా చెలరేగిపోయారు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన ఈ ఇద్దరు ఆటగాళ్లు బంగ్లా బౌలర్లకు పీడకలగా మారారు.
అశ్విన్ అదరహో
34 పరుగులకే మూడు వికెట్లు.. 144 పరుగులకే ఆరు వికెట్లు. ఇక భారత్ పనైపోయిందని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. మా అంటే భారత్ 200 పరుగులకు చాప చుట్టేస్తోందని అంతా భావించారు. అప్పటికే హసన్ మసూద్ నాలుగు వికెట్లు తీసి మంచి టచ్‌లో ఉన్నాడు. పిచ్ కూడా బౌలింగ్‌కు అనుకూలిస్తుంది. ఇక బంగ్లా బౌలర్లు చెలరేగడం... భారత్ కుప్పకూలడం ఖాయమనుకున్నారు. కానీ ఇప్పటికే టెస్టుల్లో అయిదు సెంచరీలు చేసిన అశ్విన్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. కేవలం 108 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో అశ్విన్ శతక నినాదం చేశాడు. అప్పటివరకూ మ్యాచ్ తమ చేతుల్లోనే ఉందని సంబరపడ్డ బంగ్లా బౌలర్ల ఆశలను వమ్ము చేశాడు. అశ్విన్ 102 పరుగులతో ఇంకా అజేయంగానే ఉన్నాడు.
జడేజా ఏమైనా తక్కువా...
మరోవైపు అశ్విన్‌కు రవీంద్ర జడేజా మంచి సహకారం అందించాడు. బంగ్లా బౌలర్లను సహనంగా ఎదుర్కొన్న జడేజా 73 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 117 బంతుల్లో 86 పరుగులతో రవీంద్ర జడేజా అజేయంగా నిలిచాడు.