ODI World Cup 2023: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో శ్రేయస్స్ అయ్యర్‌ ఫామ్‌ గురించి అభిమానులు, మాజీ క్రికెటర్లు చాలా ఆందోళన చెందారు. వరుసగా మూడు వికెట్లు నేలకూలితే అయ్యర్‌ అసలు నిలబడగలడా అన్న ఆందోళనలు పెరిగాయి. ఈ ఆందోళనలను మరింత పెంచుతూ ప్రపంచకప్‌లో తొలి నాలుగు మ్యాచుల్లో అయ్యర్‌ పెద్దగా రాణించలేదు. ఈ పరిస్థితుల్లో  అయ్యర్‌ను ఇంకా నాలుగో స్థానంలో కొనసాగించడంపై ఆందోళనలు కూడా వచ్చాయి. కానీ శ్రేయస్స్ లయ అందుకున్నాక అతడిని ఆపడం ఎవ్వరి తరమూ కావడం లేదు. శతకాలు సాధించకపోయినా అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో శ్రేయస్స్‌ జట్టుకు విలువైన పరుగులు జోడిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీతో కలిసి విలువైన భాగస్వామ్యం కూడా నెలకొల్పాడు. బర్త్‌ డే బాయ్‌ విరాట్‌ కోహ్లీతో కలిసి శ్రేయస్స్‌ అయ్యర్‌ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన అయ్యర్‌ ఆ తర్వాత ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 87 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 77 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్న అయ్యర్‌ను ఎంగిడి అవుట్‌ చేశారు. ఈ క్రమంలో అయ్యర్‌ తన పేరిట అరుదైన రికార్డును లిఖించుకున్నాడు.



 సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో విలువైన ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ 77 పరుగులతో సత్తా చాటాడు. ఈ ప్రపంచకప్‌లో శ్రేయస్ అయ్యర్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అయ్యర్‌... ఈ మూడు అర్ధ శతకాలు చేశాడు. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో భారత్ తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి మూడు సార్లు 50కిపైగా పరుగులు చేయడం తొలిసారి. ఇంతకుముందూ నాలుగో స్థానంలో ఇది జరగనే లేదు. ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్‌గా శ్రేయస్ రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున ఒకే ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి అత్యధిక సార్లు 50కుపైగా పరుగులు సాధించిన బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 బంతుల్లో 53 పరుగులు చేసిన అయ్యర్, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. ఇక సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 87 బంతుల్లో 77 పరుగులు చేశాడు. 



 ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ ప్రపంచ కప్‌లో అత్యద్భుతంగా ఆడుతున్న దక్షిణాఫ్రికాను 243 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో భారత్ మొదటి స్థానం పదిలం అయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లీకి లభించింది. భారత బ్యాటర్లలో కింగ్ విరాట్ కోహ్లీ (101 నాటౌట్: 121 బంతుల్లో, 10 ఫోర్లు) 49వ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ (77: 87 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) తనకు చక్కటి సహకారం అందించాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఒక్కరు కూడా 15 పరుగుల స్కోరు చేయలేకపోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో దక్షిణాఫ్రికా భరతం పట్టాడు.