తాను ఆరాధించే సచిన్‌ టెండూల్కర్‌ వన్డే సెంచరీల రికార్డును విరాట్‌ కింగ్ కోహ్లీ సమం చేశాడు. ఆ తర్వాత విరాట్‌కు సచిన్‌ శుభాకాంక్షలు కూడా చెప్పాడు. ఎప్పటికైనా తన రికార్డును భారత ఆటగాడే తిరగరాస్తాడన్న సచిన్‌ నమ్మకాన్ని...విరాట్‌ నిలబెట్టాడు. సచిన్‌ రికార్డు సమం చేసిన తర్వాత విరాట్‌ మాట్లాడుతూ సచిన్‌ ఎప్పటికీ తన హీరోనే అని, అతనిలా తాను ఆడలేనని అన్నాడు. సచిన్‌-విరాట్‌ బంధం అలాంటిది మరి. సచిన్‌ను విరాట్‌ కేవలం ఒక క్రికెటర్‌గా మాత్రమే చూడలేదు. ఒక మార్గదర్శిగా.. గురువుగా... దేవుడిగా చూశాడు. సచిన్‌ కూడా విరాట్‌కు మార్గదర్శిగా మార్గం చూపి.. గురువుగా ఆటలో నైపుణ్యాలను పెంచుకునేలా చేసి... దేవుడిగా కష్టకాలంలో అండగా ఉన్నాడు. అందుకే సచిన్‌-విరాట్‌ బంధం.. చాలా ప్రత్యేకమైనది.

 

అది 2011 ప్రపంచకప్ ఫైనల్ గెలిచిన అనంతరం....... సచిన్‌ను భుజాలపై ఎత్తుకొని విరాట్‌ కోహ్లీ, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్  తుజ్మే రబ్ దిఖ్తా హై అనే పాట పాడుతూ వాంఖడే మైదానం చుట్టూ తిరిగారు. ఆ తర్వాత 2013 నవంబర్ 16. అదే వాంఖడే స్టేడియంలో తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సచిన్‌ డ్రెస్సింగ్ రూమ్‌లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఆ మైదానంలో ఇంకా సచీన్, సచీన్‌ అనే నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. చివరి భావోద్వేగ ప్రసంగం తర్వాత సచిన్‌ తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఈ రెండు సందర్భాల్లో కోహ్లీతో తన క్షణాల గురించి టెండూల్కర్ తన ఆత్మకథ  ప్లేయింగ్ ఇట్ మై వేలో రాసుకున్నాడు.

 

సచిన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన రోజు ఒంటరిగా కూర్చొన్న టెండూల్కర్‌ వద్దకు కోహ్లీ కన్నీళ్లతో వెళ్లాడు. సచిన్‌ మణికట్టుకు ఓ ధారాన్ని కట్టాడు. అది కోహ్లీకి వాళ్ల నాన్న ఇచ్చింది. చాలా ఏళ్ల పాటు దానిని తన దగ్గరే ఉంచుకున్న కోహ్లీ దానిని అప్పుడు సచిన్‌కు ఇచ్చి అంత మంచే జరుగుతుందని చెప్పాడు. సచిన్‌కు తన వద్ద ఉన్న అత్యంత విలువైన వస్తువు ఇవ్వాలనుకున్న కోహ్లీ తన తండ్రి ఇచ్చిన ఆ దారాన్ని ఇచ్చి సచిన్‌ను తన తండ్రిలా భావించాడు. అనంతరం కోహ్లీ తన పాదాలకు నమస్కరించాడని సచిన్‌ ఆత్మకథలో రాసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. నేను అప్పుడు నువ్వు నా పాదాలను తాకడం ఏమిటి.. నన్ను కౌగిలించుకోవాలని కోహ్లీకి చెప్పానని తాను అన్నానని సచిన్‌ గుర్తు చేసుకున్నాడు.  కోహ్లీ ప్రేమకు ఉక్కిరిబిక్కిరైన టెండూల్కర్... అతడిని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్పాడు. ఎందుకంటే కాసేపు కోహ్లీ అక్కడే ఉంటే ఏడ్చేస్తానేమో అని భయంతో.

 

  డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ-సచిన్ మధ్య లోతైన అనుబంధం ఉంది. జీవిత ప్రారంభంలోనే తన తండ్రిని కోల్పోయిన కోహ్లీకి గురువుగా సచిన్‌ మార్గనిర్దేశం చేశాడు. కోహ్లీ-సచిన్‌ బంధం గురు- శిష్యుల బంధం కంటే పెద్దది. టెండూల్కర్ తరచుగా కోహ్లీని తన స్నేహితుడునే పిలుస్తాడు. కానీ కోహ్లి తరానికి మరియు అంతకు ముందు తరానికి కూడా సచిన్‌ కేవలం స్నేహితుడు కాదు. అంతకంటే ఎక్కువే. తాము ఆరాధించే వ్యక్తి సమక్షంలోనే ఉన్నామన్న ఆలోచనే యువ ఆటగాళ్లకు కొత్తగా ఉండేది. సచిన్‌ డ్రెస్సింగ్ రూమ్‌లోకి ప్రవేశించినప్పుడు అందరూ లేచి నిలబడతారు. దూరంగా నిలబడి సచిన్‌ మ్యాచ్‌కు సిద్ధమయ్యే విధానాన్ని చూసి అబ్బురపడతారు. అతడు షేక్‌ హ్యాండ్‌ ఇస్తే ఉబ్బితబ్బిబవుతారు. కోహ్లీ కూడా అలాంటి వాడే. 2008లో అరంగేట్రం చేసిన తర్వాత కోహ్లీ టెండూల్కర్ హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్‌లతో ఎక్కువ సమయం గడిపేవాడు. 

 

2011 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత జరిగిన మరో ఘటనను సచిన్ తన ఆత్మకథలో రాసుకున్నాడు. ఆ రోజు రాత్రి పార్టీ జరిగిన తర్వాత విరాట్‌, యువరాజ్‌, జహీర్‌ ఖాన్‌ మోకాళ్లపై కూర్చొని మిత్రమా మేమ నీలో దేవుణ్ణి చూస్తామంటూ పాట పాడారని సచిన్ గుర్తు చేసుకున్నాడు. 2014లో కోహ్లీ బ్యాటింగ్‌ మరచిపోయాడని తీవ్ర విమర్శలు వస్తున్న వేళ సచిన్‌... కోహ్లీతో మాట్లాడాడు. గురువులా అతడికి మార్గనిర్దేశం చేశాడు. కోహ్లీ 2.0ను సిద్ధం చేశాడు. అందుకే సచిన్‌ అంటే కోహ్లీకి అంత అనుబంధం. కోహ్లీకి సచిన్‌ అంటే ఓ స్నేహితుడు, ఓ తత్వవేత్త, ఓ మార్గదర్శి.