జన్మదినం రోజున తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కింగ్ కోహ్లీ... క్రికెట్ దేవుడిపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. 49వ వన్డే సెంచరీ చేసిన అనంతరం సచిన్‌పై తనకున్న అభిమానం గురించి చాటిచెప్పాడు. సచిన్ టెండూల్కర్ తన హీరో అని... అతనిలా తాను ఎప్పుడూ రాణించలేనని కోహ్లీ వ్యాఖ్యానించాడు. సచిన్ ఎప్పటికీ తన ఆరాధ్యుడేనన్న కోహ్లీ.. సచినతో తనను పోల్చడాన్ని తప్పుపట్టాడు. క్రికెట్ లెజెండ్ సచిన్‌లా తాను ఎప్పటికీ రాణించలేనని పేర్కొన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు స్వీకరించిన అనంతరం మాట్లాడిన కోహ్లీ... తన హీరో రికార్డును సమం చేయడం తనకు ప్రత్యేకమైన క్షణమని అన్నాడు. బ్యాటింగ్‌లో సచిన్ పరిపూర్ణుడని కోహ్లీ కొనియాడాడు. సచిన్ ఎప్పుడూ తన హీరోగానే ఉంటాడని కోహ్లీ చెప్పాడు.
క్రికెట్‌లో ఇది తనకు ఎమోషనల్ జర్నీ అన్న కోహ్లీ... టెండూల్కర్ నుంచి ప్రత్యేక సందేశాన్ని స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తాను ఆరాధించే ఆటగాడి రికార్డును సమం చేయడం... అతడి నుంచి సందేశం అందుకోవడం భావోద్వేగంగా ఉందని కోహ్లీ అన్నాడు. తాను సచిన్ బ్యాటింగ్ చూస్తూ పెరిగానన్న విరాట్.. తాను ఎప్పుడూ సచిన్‌లా రాణించలేదని అన్నాడు. నేను ఎక్కడి నుంచి వచ్చానో, నా మూలాలు ఏంటో నాకు బాగా తెలుసన్న కోహ్లీ... ఇక్కడ నిలబడి సచిన్ ప్రశంసలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నాడు.
ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ... సచిన్ వన్డే సెంచరీల రికార్డును సమం చేశాడు. సచిన్ సృష్టించిన రికార్డులను పరుగుల ప్రవాహంతో బద్దలు కొట్టిన కోహ్లీ.... వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ సరసన చేరాడు. 49 సెంచరీలతో సచిన్‌తో సమానంగా నిలిచి తాను ఎంతటి గొప్ప ఆటగాడినో మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్పాడు. వైఫల్యాల మధ్యే మూడు పుట్టిన రోజులు జరుపుకొన్న ‘కింగ్ కోహ్లీ... ఈ పుట్టిన రోజున తాను ఎంతో ఆరాధించే సచిన్ రికార్డును సమం చేసి తనకు తానే మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఈ ఘనత సాధించి అభిమానులకు మరచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చాడు.
దక్షిణాఫ్రికాపై బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై 119 బంతుల్లో 10 ఫోర్లతో సెంచరీ సాధించి విరాట్ క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును సమం చేశాడు. మొత్తం 121 బంతులు ఎదుర్కొన్న విరాట్...101 పరుగులతో అజేయంగా నిలిచాడు. పిచ్‌పై బంతి తిరుగుతున్న వేళ కోహ్లీ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. ఈ సెంచరీతో క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. ఈ ప్రపంచకప్ కల నెరవేర్చుకునేందుకు రెండే అడుగుల దూరంలో ఉన్న సమయంలో... నాకౌట్ పోరులో అద్భుత శతకంతో కోహ్లీ చెలరేగి కప్పుతో పాటు సచిన్ రికార్డును బద్దలు కొడితే భారత క్రికెట్ అభిమానులకు అంతకన్నా కావాల్సింది ఏముంది.
వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ ప్రపంచ కప్‌లో అత్యద్భుతంగా ఆడుతున్న దక్షిణాఫ్రికాను 243 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో భారత్ మొదటి స్థానం పదిలం అయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లీకి లభించింది. కింగ్ విరాట్ కోహ్లీ (101 నాటౌట్: 121 బంతుల్లో, 10 ఫోర్లు) 49వ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ (77: 87 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) తనకు చక్కటి సహకారం అందించాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఒక్కరు కూడా 15 పరుగుల స్కోరు చేయలేకపోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో దక్షిణాఫ్రికా భరతం పట్టాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ 83 పరుగులకే కుప్పకూలింది.