Sachin Tendulkar On Virat Kohli: కింగ్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాపై తన వన్డే కెరీర్‌లో 49వ సెంచరీని నమోదు చేశాడు. ఈ శతకంతో వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు. భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డే మ్యాచ్‌ల్లో 49 సెంచరీలను సాధించాడు. అయితే సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ 49వ సెంచరీపై స్పందించాడు.


విరాట్ కోహ్లీ గురించి సచిన్ టెండూల్కర్ ఏం అన్నాడు?
‘బాగా ఆడావు విరాట్. 49 నుండి 50కి చేరుకోవడానికి నాకు 365 రోజులు పట్టింది (వయసు గురించి మాట్లాడుతూ). కానీ నువ్వు తర్వాతి కొద్ది రోజుల్లోనే 49 నుంచి 50కి చేరుకుని నా రికార్డు బద్దలుకొడతావని ఆశిస్తున్నాను. అభినందనలు.’ అని ట్వీట్ చేశారు.






సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే మూడున్నర లక్షలకు పైగా లైకులు ఈ పోస్టుకు వచ్చాయి. దీనిపై అభిమానులు కామెంట్లు కూడా చేస్తున్నారు. ప్రపంచ క్రికెట్‌కు సచిన్ టెండూల్కర్ దేవుడు అయితే, కోహ్లీ రాజు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.


విరాట్ కోహ్లీ వన్డే కెరీర్ ఇలా...
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు తన కెరీర్‌లో 289 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. విరాట్ తన వన్డే కెరీర్‌లో 13,626 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో విరాట్ కోహ్లి సగటు 58.48 కాగా, స్ట్రయిక్ రేట్ 93.55గా ఉంది. విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 49 సెంచరీలు సాధించాడు. ఇది కాకుండా 70 సార్లు అర్థ సెంచరీ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 8 మ్యాచ్‌ల్లో 108.60 సగటుతో 543 పరుగులు చేశాడు.


2023 వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ ప్రపంచ కప్‌లో అత్యద్భుతంగా ఆడుతున్న దక్షిణాఫ్రికాను 243 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ప్రొటీస్ జట్టు 27.1 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో భారత్ మొదటి స్థానాన్ని పదిలం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సెంచరీ చేసిన విరాట్ కోహ్లీకి లభించింది.


భారత బ్యాట్స్‌మెన్‌లో కింగ్ విరాట్ కోహ్లీ (101 నాటౌట్: 121 బంతుల్లో, 10 ఫోర్లు) 49వ సెంచరీతో మొత్తం మ్యాచ్‌లోనే టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ (77: 87 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) విరాట్ కోహ్లీకి చక్కటి సహకారం అందించాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఒక్కరు కూడా 15 పరుగుల స్కోరు చేయలేదు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో ప్రొటీస్ భరతం పట్టాడు.