IND Vs SA: వన్డే ప్రపంచ కప్ 2023లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ ప్రపంచ కప్‌లో అత్యద్భుతంగా ఆడుతున్న దక్షిణాఫ్రికాను 243 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో భారత్ మొదటి స్థానం పదిలం అయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లీకి లభించింది.


భారత బ్యాటర్లలో కింగ్ విరాట్ కోహ్లీ (101 నాటౌట్: 121 బంతుల్లో, 10 ఫోర్లు) 49వ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ (77: 87 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) తనకు చక్కటి సహకారం అందించాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఒక్కరు కూడా 15 పరుగుల స్కోరు చేయలేకపోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో దక్షిణాఫ్రికా భరతం పట్టాడు.


బౌలర్లూ బహుపరాక్...
మందకొడి పిచ్‌పై భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆశించిన ఆరంభం లభించలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఫాంలో ఉన్న క్వింటన్ డికాక్‌ను (5: 10 బంతుల్లో, ఒక ఫోర్) అవుట్ చేసి మహ్మద్ సిరాజ్... భారత్‌కు మొదటి వికెట్ అందించాడు. దీంతో దక్షిణాఫ్రికా ఆరు పరుగులకే మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత తొమ్మిదో ఓవర్లో టెంబా బవుమాను (11: 19 బంతుల్లో, ఒక ఫోర్) అవుట్ చేసి రవీంద్ర జడేజా, పదో ఓవర్లో ఎయిడెన్ మార్క్రమ్‌ను (9: 6 బంతుల్లో, రెండు ఫోర్లు) అవుట్ చేసి షమీ... ప్రొటీస్‌ను మరింత కష్టాల్లోకి నెట్టారు. ఈ ముగ్గురూ తమ స్పెల్‌లో మొదటి ఓవర్లోనే వికెట్లు పడగొట్టడం విశేషం.


దక్షిణాఫ్రికా కష్టాలు తర్వాత కూడా ఏమాత్రం తగ్గలేదు. హెన్రిచ్ క్లాసెన్ (1: 11 బంతుల్లో), వాన్ డర్ డుసెన్‌లను (13: 32 బంతుల్లో, ఒక ఫోర్) షమీ, జడేజా వరుస ఓవర్లలో అవుట్ చేశారు. దీంతో 40 పరుగులకే ప్రొటీస్ సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. ఆదుకుంటారనుకున్న డేవిడ్ మిల్లర్ (11: 11 బంతుల్లో, రెండు ఫోర్లు), మార్కో జాన్సెన్ (14: 30 బంతుల్లో, ఒక ఫోర్) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. వీరు ఆరో వికెట్‌కు జోడించిన 19 పరుగులే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో అతి పెద్ద భాగస్వామ్యం. ఆ తర్వాత వికెట్లు టపటపా పడిపోయాయి. దీంతో దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్ అయింది.


మందకొడి పిచ్‌పై కింగ్ హవా...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్ జట్టుతో పోలిస్తే ఎలాంటి మార్పులు లేకుండా రోహిత్ సేన బరిలోకి దిగింది. రోహిత్‌ శర్మతో (40: 24 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) కలిసి... శుభ్‌మన్‌ గిల్ (23: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్)‌ భారత్‌ జట్టుకు అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. రోహిత్‌ దొరికిన బంతిని దొరికినట్లు బాదేశాడు. దీంతో ఆరంభంలో టీమిండియా స్కోరు జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోయింది. రోహిత్‌ శర్మ దూకుడుతో కేవలం 4.3 ఓవర్లలోనే భారత స్కోరు 50 పరుగుల మార్కు దాటింది. 


జట్టు స్కోరు ఆరు ఓవర్లలో 62 పరుగులు ఉన్న సమయంలో రోహిత్ శర్మ అవుటయ్యాడు. కేవలం 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ.. రబడ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం కాసేపటికే శుభ్‌మన్ గిల్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. అనంతరం బర్త్‌ డే బాయ్‌ విరాట్‌ కోహ్లీ (101 నాటౌట్: 121 బంతుల్లో, 10 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్‌ (77: 87 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) జట్టు స్కోరును ముందుకు నడిపించారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన శ్రేయస్ అయ్యర్‌ ఆ తర్వాత ధాటిగా బ్యాటింగ్ చేశాడు.  సెంచరీ దిశగా సాగుతున్న శ్రేయస్ అయ్యర్‌ను ఎంగిడి అవుట్‌ చేశారు. ఆ తర్వాత కాసేపటికే కేఎల్ రాహుల్ (8: 17 బంతుల్లో) కూడా అవుటయ్యాడు. కేఎల్ రాహుల్‌ను జాన్సన్‌ అవుట్‌ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా విరాట్ కోహ్లీ మాత్రం పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు. వన్డేల్లో 49వ సెంచరీని 119 బంతుల్లోనే అందుకున్నాడు. ఇందులో 10 ఫోర్లు కూడా ఉన్నాయి. పిచ్‌పై బంతి తిరుగుతున్న వేళ విరాట్ కోహ్లీ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు.


ఈ సెంచరీతో క్రికెట్‌ దేవుడు‌ సచిన్‌ రికార్డును కోహ్లీ సమం చేశాడు. చివర్లో సూర్యకుమార్‌ యాదవ్ (22: 14 బంతుల్లో, ఐదు ఫోర్లు) చాలా వేగంగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 14 బంతుల్లో 5 ఫోర్లతో 22 పరుగులు చేసి సూర్య పెవిలియన్‌ చేరాడు. రవీంద్ర జడేజా (29 నాటౌట్: 15 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా వేగంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 326  పరుగులు చేసింది.