ICC Cricket World Cup 2023: ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు వరుసగా ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచకప్‌లో 37వ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు ఆడాయి. అందులోనూ భారత్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో తన నంబర్ వన్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 243 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమిండియా... ఈ ప్రపంచకప్‌లో తాను ఎలాంటి ఫామ్‌లో ఉందో చూపించింది. ఈ భారీ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
భారత క్రికెట్ జట్టు పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ టోర్నీలో నంబర్ వన్ స్థానం భారత జట్టుకు కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే టీమ్ ఇండియా తన 8 మ్యాచ్‌లలో మొత్తం ఎనిమిదిట్లోనూ గెలిచి 16 పాయింట్లు సాధించింది. ఇంకా ఒక మ్యాచ్ భారత్‌కు మిగిలే ఉంది. ఈ టోర్నమెంట్‌లో మరే ఇతర జట్టు 16 పాయింట్లను చేరుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే అన్ని జట్లూ కనీసం రెండు మ్యాచ్‌లు అయినా ఓడిపోయాయి. అందువల్ల టీమ్ ఇండియా ఇప్పుడు లీగ్ దశను పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో ముగించనుంది.
పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత ఎవరు?
భారత్ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచుల్లో ఆరిట్లో గెలిచి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు సెమీ ఫైనల్‌కు భారత్, దక్షిణాఫ్రికా జట్లు మాత్రమే ఎంపికయ్యాయి.
వారి తర్వాత ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదు గెలిచి, రెండింట్లో ఓడి మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం నాలుగు స్థానంలో ఉంది. టోర్నమెంట్‌లో మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన న్యూజిలాండ్, తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇప్పుడు 8 పాయింట్లు, +0.398 నెట్ రన్ రేట్‌తో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఈ జట్టు తన చివరి లీగ్ మ్యాచ్‌ని ఇంగ్లండ్‌తో ఆడాల్సి ఉంది.
ఈ నాలుగు జట్ల తర్వాత పాకిస్థాన్ టీమ్ ఐదో స్థానంలో ఉంది. ఈ జట్టు 8 మ్యాచ్‌లలో 4 గెలిచింది. 8 పాయింట్లు, +0.036 నెట్ రన్ రేట్ సాధించింది. దీని కారణంగా ఐదో స్థానంలో ఉంది. వారి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆరో స్థానంలో ఉంది. వారి దగ్గర కూడా 8 పాయింట్లు ఉన్నాయి. కానీ వారి నెట్ రన్ రేట్ పాకిస్తాన్ కంటే తక్కువగా ఉంది. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ ఆరో స్థానంలో ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్... ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీరి తర్వాత శ్రీలంక ఏడో స్థానంలో, నెదర్లాండ్స్ ఎనిమిదో స్థానంలో, బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానంలో, ఇంగ్లండ్ పదో స్థానంలో ఉన్నాయి. ఇప్పటి వరకు బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లు మాత్రమే ఈ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించాయి.