ChatGPT -  KL Rahul:  ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అదే క్రికెటర్ కేఎల్ రాహుల్ ఫాం. గత కొన్నాళ్లుగా తీవ్ర ఫామ్ లేమితో సతమతమవుతున్న రాహుల్ పై ఇంటా బయటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీలు, అభిమానులు జట్టులో అతడి స్థానంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అందుబాటులో ఎందరో ప్రతిభావంతులు ఉండగా పేలవ ప్రదర్శన చేస్తున్న రాహుల్ ను ఎందుకు కొనసాగిస్తున్నారంటూ.. భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ప్రశ్నిస్తున్నారు. దినేశ్ కార్తీక్, హర్భజన్ సింగ్ లాంటి వెటరన్ ఆటగాళ్లు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. 


ఈ క్రమంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ప్లాట్ ఫామ్ చాట్ జీపీటీ కూడా రాహుల్ విషయంలో భాగమైంది. అదెలా అంటే.. ఓ అభిమాని రాహుల్ గురించి చాట్ జీపీటీని ప్రశ్నించాడు. అతడిని జట్టులో నుంచి తీసేయాలా అని అడిగాడు. దానికి చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకీ ఏమని సమాధానమిచ్చిందో తెలుసా.


అభిమాని ప్రశ్న:  టీమిండియా నుంచి కేఎల్ రాహుల్ ను తప్పించాలా?


దీనికి చాట్ జీపీటీ ఇలా జవాబిచ్చింది. 'నాకు వ్యక్తులు, జట్లపై వ్యక్తిగతమైన అభిప్రాయం లేదు. ఎవరిపట్ల పక్షపాతం లేదు. అయితే సాధారణ నియమాల ప్రకారం.. జట్టు నుంచి ఆటగాడిని తొలిగించాలనే నిర్ణయం అతని ఇటీవలి ఆటతీరు, ఫిట్ నెస్ ఆధారంగా ఉండాలి. వారి నైపుణ్యాలు, సామర్థ్యాలు జట్టు అవసరాలకు తగిన విధంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. టెస్ట్ మ్యాచుల్లో కేఎల్ రాహుల్ ప్రదర్శన ఇటీవల సరిగ్గా లేదు. అతని కన్నామరింత మెరుగ్గా రాణించగల ప్రతిభావంతులు జట్టులో ఉన్నారు. రాహుల్ ను తప్పించే విషయంలో ఈ అంశాన్ని జట్టు యాజమాన్యం పరిగణనలోకి తీసుకోవచ్చు. అతడు బాగా రాణిస్తున్నాడు.. జట్టు అవసరాలకు తగ్గటుగా కీలక పాత్ర పోషిస్తున్నాడు అనుకుంటే జట్టులో కొనసాగించవచ్చు. అయితే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రమే అతడి ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అది కూడా ఆటగాడి ఫామ్‌, ఫిట్‌నెస్‌, జట్టు వ్యూహాలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.' అని చాట్ జీపీటీ చెప్పింది. 


మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మిగిలిన రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో రాహుల్ ను వైస్ కెప్టెన్ పదవి నుంచి తప్పించారు. తుది జట్టులోనూ అతడికి స్థానం లభించదనే వార్తలు వస్తున్నాయి. 






రాహుల్ ను తప్పించాలి


ఆసీస్ తో మిగిలిన రెండు టెస్టులకు రాహుల్ విశ్రాంతి తీసుకోవాలని భారత వెటరన్ దినేశ్ కార్తీక్ సూచించాడు. ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్ కు ఉత్సాహంగా సిద్ధమవ్వాలని చెప్పాడు. 'రాహుల్ పరిస్థితి ఏంటో ఇప్పుడు నాకు అర్ధమవుతోంది. ఎందుకంటే నేనూ ఒకప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను. అయితే ఆసీస్ తో మిగిలిన రెండు టెస్టులకు కేఎల్ ను పక్కన పెడితే ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ నిర్ణయం 2 మ్యాచుల ప్రదర్శనను బట్టి తీసుకున్నది కాదని అతడు గ్రహించాలి. గత 5, 6 టెస్టులుగా రాహుల్ ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. మిగిలిన 2 మ్యాచ్ లకు విశ్రాంతి తీసుకుని తర్వాత జరిగే వన్డే సిరీస్ కు ఉత్సాహంగా సిద్ధమవ్వాలి' అని కార్తీక్ అన్నాడు.