Dhawan opens up about relationship with his son: కుమారుడి గురించి తలుచుకుని టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) మరోసారి భావోద్వేగానికి గురయ్యాడు. తన కుమారుడు జోరావర్(Zoravar)తో మాట్లాడి ఐదారు నెలలు అవుతోందని ఉద్వేగానికి లోనయ్యాడు. తన బిడ్డతో సరదాగా గడపాలని, అతడిని నా చేతుల్లో నిద్ర పుచ్చాలని, గట్టిగా కౌగిలించుకోవాలని తనకు ఉంటుందని ధావన్ అన్నాడు. తండ్రి ప్రేమను ఇవ్వాలనిపిస్తుందని... జోరావర్‌తో మాట్లాడి ఐదారు నెలలు అవుతోందని శిఖర్ తెలిపాడు. అయినా సరే తాను పాజిటివ్‌గానే ఉన్నానని... తన కుమారుడిని ప్రేమిస్తూనే ఉన్నానని తెలిపాడు. వాడు సంతోషంగా ఉండాలని.. దేవుడు కరుణిస్తే ఏదో ఒక రోజు జోరావర్ తనతో కలిసి ఉంటాడని ధావన్ వివరించాడు.
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikar Dhawan) గత కొన్నాళ్లుగా వ్యక్తిగతంగా, కెరీర్ లోనూ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఓవైపు భార్య అయేషా ముఖర్జీ (Ayesha Mukherjee) నుంచి మానసిక వేధింపులు భరించలేక కోర్టు నుంచి విడాకులు తీసుకున్నాడు. కానీ అప్పటినుంచి శిఖర్ ధావన్ కు భార్య నుంచి వేధింపులు రెట్టింపయ్యాయి. కుమారుడ్ని ధావన్ కు దూరం చేసిన మాజీ భార్య అయేషా కనీసం సోషల్ మీడియాలో సైతం జోరావర్ కు సంబంధించిన వివరాలు క్రికెటర్ కు తెలియకుండా జాగ్రత్త పడుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీని ధావన్ 2012లో వివాహం చేసుకోగా.. జోరావర్ సంతానం. అయితే, వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2020 నుంచి దూరంగా ఉంటున్నారు. ధావన్ నుంచి తాను విడిపోతున్నట్లు 2021లో ఆయేషా ప్రకటించింది. ఆమెకు అంతకుముందే పెళ్లి అయి భర్త నుంచి విడిపోయింది. మొదటి భర్త ద్వారా ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. విడాకుల కేసు తీర్పులో కోర్టు ధావన్ తన కుమారుడితో వీడియో కాల్ ద్వారా టచ్‌లో ఉండేందుకు అనుమతించింది. స్కూల్ వెకేషన్ సమయంలో ఆయేషా తన కుమారుడిని భారత్‌కు తీసుకొచ్చి ధావన్ కుటుంబంతో సమయం గడిపేలా చూడాలని కోర్టు ఆదేశించింది.
ఐపీఎల్‌పైనే దృష్టి
టీమ్‌ఇండియాలో అవకాశం రాకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగులో పంజాబ్ కింగ్స్‌కు ట్రోఫీ అందించడమే దృష్టి సారిస్తానని ధావన్ అంటున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ, విజయ్ హజారే ఆడతానని చెప్పాడు. 'నా భవిష్యత్తు గురించి ఏ సెలక్టర్‌నూ కలవలేదు. నేనెప్పుడూ ఎన్‌సీఏకు వెళ్తుంటాను. అక్కడ సమయం ఆస్వాదిస్తాను. అక్కడి సౌకర్యాలు అద్భుతంగా ఉంటాయి. అక్కడే నా కెరీర్ మలుపు తిరిగింది. అందుకు కృతజ్ఞుడిని' అని తెలిపాడు.
'నేను ఐపీఎల్‌కు సన్నద్ధం అవ్వాల్సి ఉంటుంది. సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ఆడతాను. వరుస విరామాలు వస్తే ఘనంగా పునరాగమనం చేయాల్సి ఉంటుంది. అది కష్టమని భావిస్తే కష్టంగానే ఉంటుంది. నేనెప్పుడూ అలా ఆలోచించను. ఇతర ఆటగాళ్లు ఎక్కువ ఫార్మాట్లు ఆడుతుంటూ ఫ్లో వేరేగా ఉంటుంది. అలాంటప్పుడు వారు రాణిస్తే వెంటనే ఎక్కువ మంది దృష్టిలో పడతారు' అని గబ్బర్ పేర్కొన్నాడు.