Bangladesh ODI Captain:
బంగ్లాదేశ్ కొత్త కెప్టెన్‌ను నియమించుకుంది. సీనియర్ ఆటగాడు షకిబ్ అల్ హసన్‌ను (Shakib Al Hasan) వన్డే సారథిగా ఎంపిక చేసింది. ఆసియాకప్, ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు అతడే నాయకత్వం వహిస్తాడు. ఆ తర్వాత సెలక్షన్ కమిటీ మరో నాయకుడి వేట కొనసాగించనుంది.
వెన్నెముక గాయంతో తమీమ్ ఇక్బాల్ ఆసియా కప్‌కు దూరమయ్యాడు. దాంతో ఆగస్టు 3న తమీమ్ ఇక్బాల్ సారథ్యానికి రాజీనామా చేశాడు. అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో షకిబ్ అల్ హసన్ మళ్లీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సి వస్తోంది. సెప్టెంబర్లో ఆ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఆసియాకప్ కోసం శ్రీలంక, పాకిస్థాన్, వన్డే ప్రపంచకప్ (ICC Odi Worldcup 2023) కోసం భారత్‌కు వస్తుంది.
బంగ్లాదేశ్ కెప్టెన్‌గా షకిబ్ అల్ హసన్‌ను నియమిస్తున్నామని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తమ ఇంటి వద్ద ప్రకటించారు. 'ఆసియాకప్, న్యూజిలాండ్ సిరీస్, వన్డే ప్రపంచకప్‌కు షకిబే కెప్టెన్. లంక ప్రీమియర్ లీగ్ నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగొచ్చాక అతడి గురించి మరింత మాట్లాడతాం. అలాగే అతడి లాంగ్‌టర్మ్ ప్లాన్ తెలుసుకోవాల్సి ఉంది. గురువారం అతడితో ఫోన్లో మాట్లాడాను. అతడితో నేరుగా మాట్లాడితే ఇంకా బాగుండేది. కాకపోతే షకిబ్ లీగ్ క్రికెట్లో బిజీగా ఉన్నాడు. అలాగే ఒకే ఫార్మాట్లో నడిపిస్తాడా లేదా మూడింట్లోనూ ఇష్టమేనా తెలుసుకోవాల్సి ఉంది' అని ఆయన అన్నారు.
'కన్ఫ్యూషన్‌కు తావులేదు. నేనింతకు ముందే చెప్పాను. మనకున్న ప్రధాన ఆటగాడు షకిబే. అతడి కన్నా ఇంకెవరు మెరుగ్గా నడిపిస్తారు? అయితే నియమించే ముందు అతడితో మాట్లాడాల్సి ఉంటుంది. మరోలా భావించాల్సిన అవసరం లేదు. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌కు ఒకే జట్టు ఉంటుంది. ఒక్క స్థానమే ఖాళీ ఉంది. వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్న తమీమ్ ఇక్బాల్ పరిస్థితేంటో తెలియదు. ఆసియాకప్‌లో ఒకరిద్దరిని కొత్తగా ప్రయత్నించాలి' అని హసన్ అన్నారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు మూడు ఫార్మాట్లలోనూ షకిబ్ అల్ హసనే కెప్టెన్. గతేడాది నుంచే అతడు మూడోసారి టెస్టు, టీ20 కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 2009 - 2011 మధ్య షకిబ్ 49 వన్డేలకు సారథ్యం వహించాడు. అందులో 22 గెలిచాడు. వరుసగా గాయాల పాలవ్వడంతో మష్రఫె మొర్తజాకు నాయకత్వం వెళ్లింది. మళ్లీ 2015 నుంచి 2017 వరకు షకిబ్‌కే పగ్గాలు దక్కాయి. ఇప్పటి వరకు అతడు 19 టెస్టులు, 39 టీ20లు, 52 వన్డేలకు కెప్టెన్సీ చేశాడు.
వెన్నెముక గాయం వల్ల తమీమ్ ఇక్బాల్ ఫిట్‌నెస్ పరిస్థితి అర్థమవ్వడం లేదు. కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలియడం లేదు. దాంతో వన్డే కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. సెప్టెంబర్లో జరిగే న్యూజిలాండ్ సిరీస్ వరకు ఫిట్‌నెస్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. జులై 6న అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా ప్రధాని షేక్ హసీనా అభ్యర్థన మేరకు నిర్ణయాన్ని మళ్లీ వెనక్కి తీసుకున్నాడు.