Womens Premier League 2024: మహిళల ప్రీమియర్‌ లీగ్‌(Womens Premier League 2024)కు సర్వం సిద్ధమైంది. హర్మన్‌ప్రీత్‌ మెరుపులు, షెఫాలి వర్మ విధ్వంసానికి సమయం ఆసన్నమైంది. రేపటి నుంచే మహిళల ప్రీమియర్‌ లీగ్‌ మొదలు కానుంది. ఈ ఏడాది కొంచెం ముందుగానే రెండో సీజన్‌ మొదలవుతోంది. గత ఏడాది ఫార్మాట్లోనే అవే జట్లతో లీగ్‌ జరగబోతోంది. దాదాపుగా అన్ని జట్ల స్టార్‌ క్రికెటర్లూ ఆడబోతుండటంతో లీగ్‌ రసవత్తరంగా, హోరాహోరీగా సాగనుంది. తొలి సీజన్లో విజేత ముంబయి ఇండియన్స్‌ టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. నిరుటి రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ చాలా బలంగా కనిపిస్తోంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, యూపీ వారియర్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ ఈసారి ప్రదర్శన మార్చాలని పట్టుదలతో ఉన్నాయి. ఫిబ్రవరి 23 నుంచి రెండో సీజన్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనున్నాయి. బెంగ‌ళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహించ‌నున్నారు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూర్, యూపీ వారియ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య ఫిబ్రవ‌రి 24న‌ రెండో మ్యాచ్ జ‌రుగునుంది. ఈ సీజన్‌లో మొదటి దశ మ్యాచ్‌లు బెంగళూరులో రెండో దశ మ్యాచ్‌లు ఢిల్లీలో జరగనున్నాయి. ఎలిమినేటర్‌, ఫైనల్‌ కలిపి మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మార్చి 17న ఢిల్లీలో ఫైనల్ మ్యాచ్‌ ఉంటుంది. తొలి సీజ‌న్‌లో ముంబైకే ప‌రిమిత‌మైన డ‌బ్ల్యూపీఎల్‌.. రెండో సీజ‌న్‌లో రెండు న‌గ‌రాల్లో జ‌రుగ‌నుంది. 


భారీ ధర
ఈ ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో ఆస్ట్రేలియా.. భారత క్రీడాకారిణులకు భారీ ధర పలికింది. మొత్తం 165 మందిలో 104 మంది భారత(Indian) క్రికెటర్లు కాగా.. 61 మంది విదేశీ ప్లేయర్లు వేలంలో పాల్గొన్నారు. ఇందులో 56 మంది మాత్రమే క్యాప్‌డ్ ప్లేయర్లు కాగా 109 మంది అన్‌క్యాప్‌డ్ క్రికెటర్లు. జాతీయ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన వారిని క్యాప్‌డ్ ప్లేయర్లు అంటారు. నేషనల్ టీమ్‌కు ఇంకా ఆడనివారినే అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లుగా పిలుస్తారు. వీరిలో అత్యధికంగా గుజ‌రాత్ జెయింట్స్ 10 మంది, ఆర్‌సీబీ ఏడు మందిని, ముంబై ఇండియ‌న్స్ అయిదుగురిని, ఉత్తరప్రదేశ్‌ వారియర్స్ అయిదుగురిని, ఢిల్లీ క్యాపిట‌ల్స్ ముగ్గురు ప్లేయ‌ర్లను వేలంలో కొనుగోలు చేశాయి. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అనాబెల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2కోట్ల‌కు ద‌క్కించుకోగా, అన్‌క్యాప్‌డ్ కేటగిరీలో భారత్‌కు చెందిన కాష్వీ గౌతమ్‌ను గుజరాత్ టైటాన్స్‌లో రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. 


భారత్‌ ప్లేయర్లు ఇలా...
 భార‌త్‌కు చెందిన అమన్‌దీప్ కౌర్‌ బేస్ ప్రైజ్ అయిన రూ.10 లక్షలకే ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది. భార‌త్‌కు చెందిన సైమా థాకోర్ బేస్ ప్రైజ్ అయిన రూ.10 లక్షలకే యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది . స్కాట్లాండ్‌కు చెందిన కేథరీన్ బ్రైస్ బేస్ ప్రైజ్ అయిన రూ.10లక్ష‌ల‌కే గుజరాత్ జెయింట్స్‌ దక్కించుకుంది. భార‌త్‌కు చెందిన మన్నత్ కశ్యప్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్షలకే గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. భార‌త్‌కు చెందిన అశ్విని కుమారి బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. భార‌త్‌కు చెందిన ఫాతిమా జాఫర్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. భార‌త్‌కు చెందిన కీర్తన బాలకృష్ణన్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది. భార‌త్‌కు చెందిన శుభా సతీష్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది .