Ind Vs Eng Odi Series Updates: భారత వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ పరంగా బ్యాడ్ ఫేజ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ద్వీతియార్థం నుంచి తను సరిగ్గా రాణించిందే లేదు. బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ నుంచి మొదలు పెడితే, న్యూజిలాండ్ సిరీస్, ఆస్ట్రేలియా టూర్ లో మూడు టెస్టుల్లో తను ఘోరంగా విఫలమయ్యాడు. ఒకనొక దశలో కెప్టెన్ అయినా కూడా అతడిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈనెల నుంచి మొదలైన ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో సత్తా చాటుతాడనుకుంటే రెండు పరుగులకే తొలి మ్యాచ్ లో ఔటై విమర్శల పాలు అయ్యాడు. తాజాగా రోహిత్ ఫామ్ పై మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆందోళన వ్యక్తం చేశాడు. రోహిత్ ఫామ్ ఇలాగే సాగితే కష్టమేనని తేల్చి చెప్పాడు.
ఈ ఫార్మాట్ అనుకూలం.. మిగతా ఫార్మాట్లతో పోలిస్తే వన్డే ఫార్మాట్లో క్రికెటర్లు తమ ఫామ్ ను దొరకబుచ్చుకోవచ్చనేది విశ్లేషకుల వాదన. కావలినంత టైమ్ ఉండటంతో పాటు ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్ల మూలంగా కూడా బ్యాటర్లు చెలరేగడానికి అవకాశముంటుంది. ఇక రోహిత్ ఫామ్ పై మంజ్రేకర్ మాట్లాడుతూ.. అతను ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రతి క్రికెటర్ ఒకనొక దశలో ఫేస్ చేయాల్సిందేనని పేర్కొన్నాడు. తాను కూడా గతంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు. హిట్ మ్యాన్ ప్రస్తుతం ఒత్తిడిలో ఉండటం వల్లనే అలా ఔట్ అవుతున్నాడని వ్యాఖ్యానించాడు. అయితే సాధ్యమైనంత త్వరగా రోహిత్ గాడిలో పడాలని సూచించాడు. టాప్ త్రీలో, అది కూడా ఓపెనర్ గా ఆడుతున్నప్పుడు బాగా రాణించాలన్న ఒత్తిడి ఉంటుందని, దాన్ని ఎలా అధిగమించాలో రోహిత్ కు తెలుసని వ్యాఖ్యానించాడు. మరోవైపు ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ గాడిన పడకపోతే తన కెరీర్ కే ముప్పు వచ్చే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించాడు.
గతకొంతకాలంగా చర్చ..రోకో ద్వయంగా పేరుగాంచిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఫామ్ పై గత కొంతకాలంగా విమర్శలు చెలరేగుతున్నాయి. బ్యాట్ తో సత్తా చాటకుండా, జట్టుకు భారంగా మారరని, రిటైర్మెంట్ పై త్వరగా ఏదో ఒకటి తేల్చాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వీళ్ల కారణంగా యంగ్ ప్లేయర్లకు అవకాశాలు రాకుండా పోతున్నాయని పేర్కొన్నారు. ఏదేమైనా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ వన్డే సిరీస్ సువర్ణావకాశంగా లభించింది. అయితే తొలి వన్డే ఇద్దరికి ఉపయోగపడలేదు. ఈ మ్యాచ్ లో మోకాల్లో స్వెల్లింగ్ కారణంగా కోహ్లీ దూరమైతే, కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన రోహిత్ విఫలమయ్యాడు. తను ఫామ్ లో ఉన్నప్పుడు అలవోకగా షాట్లు ఆడే బంతులకే తను ఔటవుతున్నాడు. సాధ్యమైనంత త్వరగా ఈ బలహీతను రోహిత్ అధిగమించాల్సి ఉంటుంది. వన్డే సిరీస్ లోనే రోకో ద్వయం ఫామ్ లోకి వస్తే, రాబోయే మెగాటోర్నీలో భారత్ మరింత శక్తివంతంగా మారతుంది. ఇక వన్డే సిరీస్ లో రెండో మ్యాచ్ ఆదివారం అంటే ఈనెల 9న కటక్ లో జరుగుతుంది. మెగాటోర్నీ ఈనెల 19 నుంచి పాక్ లో స్టార్ట్ అవుతుండగా, 20 నుంచి భారత్ మ్యాచ్ లు దుబాయ్ లో జరుగుతాయి.