దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా... దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. సిరీస్‌ దక్కాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజు శాంసన్‌... సూపర్‌ సెంచరీతో అదరగొట్టాడు. తిలక్‌ వర్మ కూడా అర్ధ శతకంతో సత్తా చాటడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది.

 

నిర్ణయాత్మకమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రజత్‌ పాటిదార్‌ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. సాయి సుదర్శన్‌తో కలిసి రజత్‌ పాటిదార్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. వీరిద్దరూ టీమిండియాకు పర్వాలేదనిపించే ఆరంభం ఇచ్చారు. రజత్‌ పాటిదార్‌ 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సుతో 22 పరుగులు చేసి అవుటయ్యాడు. ఉన్నంతవరకూ రజత్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. కానీ పాటిదార్‌ను బర్గర్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో 34 పరుగుల వద్ద భారత జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. తొలి రెండు వన్డేల్లో అర్ధ శతకాలతో చెలరేగిన సాయి సుదర్శన్‌ ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే వెనుదిరిగాడు. 16 బంతుల్లో ఒక ఫోర్‌తో పది పరుగులు చేసిన సాయి సుదర్శన్‌ను.. హెండ్రింక్స్‌ ఎల్బీ చేశాడు. దీంతో 49 పరుగుల వద్ద టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్‌ కె.ఎల్‌. రాహుల్‌తో కలిసి సంజు శాంసన్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి రెండు మ్యాచుల్లో నిరాశ పరిచిన సంజు శాంసన్‌ కీలకమైన ఈ మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. కె.ఎల్‌. రాహుల్‌ 35 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో 101 పరుగుల వద్ద భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది.

 

రాహుల్‌ అవుటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్‌వర్మతో కలిసి సంజు శాంసన్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. వీరిద్దరూ సౌతాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ జట్టు స్కోరును ముందుకు నడిపించారు. సంజు శాంసన్‌.. సమయోచితంగా బ్యాటింగ్‌ చేశాడు. నాలుగో వికెట్‌కు శాంసన్‌-తిలక్‌ వర్మ ఇద్దరూ 116 పరుగులు జోడించారు.  ఆ తర్వాత 77 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేసి అవుటయ్యాడు. తిలక్‌ వర్మను మహరాజ్‌ అవుట్‌ చేశాడు. తిలక్‌ వర్మ అవుటైనా సంజు శాంసన్‌ సాధికారికంగా బ్యాటింగ్‌ చేశాడు. 110 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సులతో సెంచరీ సాధించాడు. అనంతరం 114 బంతుల్లో 108 పరుగులు చేసి సంజు శాంసన్ అవుటయ్యాడు. అక్షర్‌ పటేల్‌ మూడు బంతుల్లో ఒక్క పరుగే చేసి వెనుదిరిగాడు. చివర్లో రింకూసింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. రింకూసింగ్‌  27 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. వాషింగ్టన్‌సుందర్‌  9 బంతుల్లో 14 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హెండ్రింక్స్‌ మూడు, బర్గర్‌ 2, విలియమ్స్‌ ఒక వికెట్‌ తీశారు.

 

అయితే భారత్ బౌలింగ్ విభాగం ఆందోళన పరుస్తోంది. తొలి వన్డేలో అద్భుతంగా రాణించిన బౌలర్లు... రెండో మ్యాచ్‌లో తేలిపోయారు. ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే టీమిండియా బౌలర్లు రాణించాల్సి ఉంది. ముఖేష్ కుమార్ రెండు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. ఈ మ్యాచ్‌లో ముఖేష్‌ లయను అందుకుంటే భారత్‌కు తిరుగుండదు. అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ మొదటి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. కానీ రెండో మ్యాచ్‌లో ఆ ఊపును కొనసాగించలేకపోయారు. ఈ లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే దక్షిణాఫ్రికా బ్యాటర్లను త్వరగా పెవిలియన్‌కు పంపాలంటే మరోసారి భారత పేస్‌ త్రయం విజృంభించాల్సి ఉంది. ముఖేష్ కొత్త బంతితో లయను అందుకుని వికెట్లు తీయడం భారత్‌కు అవసరం.