Sachin Tendulkar Birthday Special: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ నేడు 51వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. మాస్టర్ బ్లాస్టర్‌గా క్రికెట్ అభిమానులను అలరించిన సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, యువరాజ్, సెహ్వాగ్, రైనా, బిసిసిఐ కార్య దర్శి జైషా ఇలా చాలామంది సచిన్కు విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అయితే వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి కూడా ఉన్నాయి . వాటిలో ఒకటి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). ఎక్స్ వేదిగా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. సచిన్ తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ను ప్రస్తావిస్తూ విషెస్ తెలిపింది. 664 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో 34,357 పరుగులు చేసినట్లు గుర్తు చేసింది. 201 వికెట్లు తీసినట్లు తెలిపింది. వీటితో పాటూ 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన విషయాన్ని ప్రస్తావించింది. అంతర్జాతీయ మ్యాచుల్లో 100 శతకాలు బాదిన ఏకైక క్రికెటర్ అని కొనియాడింది. క్రికెట్ లెజెండ్‌కు ఇవే మా పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టింది.
ఇటు ఐసిసి కూడా ఒక ప్రత్యేక వీడియో తో మాస్టర్ బ్లాస్టర్ కు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుత బౌలర్లను సచిన్ ఎదుర్కొంటే ఎలాంటి షాట్స్ ఆడేవారో తెలిపేలా ఐసీసీ వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేసింది. ఈ వీడియో లో సచిన్ బ్యాటింగ్ చేస్తుంటాడు. ప్యాట్ కమిన్స్, కసిగో రబాడ, ముస్తాఫిజుర్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చేస్తారు. వారి బంతులకి సచిన్ బౌండరీలు బాదినట్లు వీడియోను రూపొందించింది. సచిన్ బ్యాటింగ్ మెరుపులు, అభిమానుల అరుపులతో ఉన్న వీడియో చూసిన క్రికెట్ అభిమానులు మురిసిపోతున్నారు. ఆటకు తగ్గ కామెంటరీతో ఎడిటింగ్ అద్భుతంగా ఉందంటూ ఐసీసీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్
24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో మాస్టర్ బ్లాస్టర్ ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మరెన్నో అద్భుతమైన విజయాలందించాడు. క్రికెట్‌లో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు సచిన్. ఎవరూ అందుకోలేని రికార్డులు, ఎవరికీ సాధ్యం కాని సుదీర్ఘ కెరీర్ సచిన్ సొంతం. క్రికెట్‌కు ఎన్నో అరుదైన రికార్డులు పరిచయం చేశాడు. క్రికెట్ గాడ్'గా అభిమానుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. 1973 ఏప్రిల్ 24న ముంబైలో సచిన్ జన్మించాడు. సచిన్ తండ్రి రమేష్ తెందూల్కర్, సుప్రసిద్ధ మరాఠీ నవలా రచయిత, కవి. తల్లి రజని, ఆమె ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో పని చేశారు. గురువు రమాకాంత్ అచ్రేకర్ సలహాతో సచిన్, స్టేడియానికి దగ్గరగా ఉండే పాఠశాలకు మారి క్రికెట్లో శిక్షణ తీసుకున్నాడు.
అవార్డులు, గుర్తింపు
సచిన్‌కు 1994లో అర్జున అవార్డు, 1997/98లో ఖేల్ రత్న, 1999లో పద్మశ్రీ, 2008లో పద్మ విభూషణ్, 2014లో భారతరత్న వరించాయి. 2012లో సచిన్ టెండూల్కర్ రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యాడు. అంతే కాకుండా రాజ్యసభకు నామినేట్ అయిన తొలి క్రీడాకారుడిగా సచిన్ గుర్తింపు పొందాడు. క్రికెట్లో తన అనుభవాలతో సచిన్ 'ప్లేయింగ్ ఇట్ మై వే' అనే ఆత్మకథ రాశాడు. సచిన్ జీవితాన్ని 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' పేరుతో ఓ డాక్యుమెంటరీ మూవీగా మలిచారు.