నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్‌ ఎంచుకుంది. వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగింది. ప్రపంచ కప్‌లో 15వ మ్యాచ్‌లో, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ తలపడుతున్నాయి. ధర్మశాలలో ఈ మ్యాచ్‌ జరుగుతోంది. ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న దక్షిణాఫ్రికా మరో విజయంపై కన్నేసింది. భీకర ఫామ్‌లో ఉన్న బవుమా సేనకు.. గట్టిపోటీ ఇవ్వాలని నెదర్లాండ్స్‌ పట్టుదలగా ఉంది. కానీ డికాక్‌ వరుస సెంచరీలతో ఊపు మీదున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ముగ్గురు దక్షిణాఫ్రికా బ్యాటర్లు సెంచరీలు చేశారు. ఈ పరిస్థితుల్లో అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ప్రొటీస్‌ను నెదర్లాండ్స్‌ అడ్డుకోవడం అంత తేలికేమీ కాదు. కానీ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు అఫ్ఘానిస్థాన్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనూ అలాంటి ప్రదర్శనే చేసి సఫారీలకు షాక్‌ ఇవ్వాలని నెదర్లాండ్స్ భావిస్తోంది. గతంలో బలహీనమైన జట్లతో ఓడిపోయి ప్రపంచ కప్‌ నుంచి నిష్క్రమించిన చరిత్ర దక్షిణాఫ్రికాకు ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌ను తాము తేలిగ్గా తీసుకోవడం లేదని ప్రొటీస్‌ జట్టు కెప్టెన్‌ బవుమా ఇప్పటికే వెల్లడించాడు. కాబట్టి దక్షిణాఫ్రికా భారీ విజయంపై కన్నేసింది.

 

ఈ ఏడాదిలో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ రెండు వన్డేలు ఆడాయి. ఈ రెండు వన్డేల్లోనూ ప్రొటీస్‌ విజయం సాధించింది. రెండుసార్లు ఏకపక్ష విజయాలే సాధించింది. కానీ తమదైన రోజున ఎంత పెద్ద జట్టునైనా ఓడించే సత్తా నెదర్లాండ్స్‌కు ఉంది. కాబట్టి దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌ను అంత తేలిగ్గా తీసుకోదు. గత అయిదు వన్డేల్లో దక్షిణాఫ్రికా విజయాలు సాధించింది. ప్రతిమ్యాచ్‌లోనూ మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 300 కంటే ఎక్కువ పరుగులు చేసింది. రెండుసార్లు 400 పరుగుల మార్క్‌ను కూడా దాటింది. ఈ ప్రపంచకప్‌లో సఫారీ జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్‌ ఉంది. 2023 ప్రారంభం నుంచి సఫారీ పది మంది బ్యాటర్లు 50 కంటే ఎక్కువ సగటుతో పరుగులు చేస్తున్నారు. టెంబా బావుమా, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. క్వింటన్ డి కాక్ కూడా భీకర ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ సెంచరీలు చేసి ఊపు మీదున్నాడు. డికాక్‌ మరోసారి చెలరేగితే నెదర్లాండ్స్‌కు చుక్కలు కనపడడం ఖాయం. 2021 నుంచి డికాక్‌ పేస్, స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తూ బౌలర్లను ఒత్తిడిలో ఉంచుతున్నాడు. ఇది పవర్‌ప్లేలో మాత్రమే కాకుండా మిడిల్ ఓవర్లలోనూ ధాటిగా  పరుగులు సాధిస్తున్నాడు.

 

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయినా నెదర్లాండ్స్‌ మంచి పోరాటాన్ని ప్రదర్శించింది. బాస్ డి లీడే బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. స్కాట్లాండ్‌పై ఐదు వికెట్లు తీసిన డి లీడే నెదర్లాండ్స్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. లీడే మరోసారి మెరవాలని నెదర్లాండ్స్‌ భావిస్తోంది. లీడే పాకిస్తాన్‌పై 67 పరుగులు చేశాడు.

 

దక్షిణాఫ్రికా ఫైనల్ 11: 

  క్వింటన్ డి కాక్, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జెన్సన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, లుంగీ ఎన్గిడి.

 

నెదర్లాండ్స్ ఫైనల్ 11: 

విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిదనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెన్