భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య బాక్సింగ్‌ డే టెస్టుకు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. టీమిండియా స్టార్‌ బ్యాటర్లు చాలాకాలం తర్వాత సుదీర్ఘ ఫార్మట్‌లో బరిలోకి దిగనుడడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గాయం కారణంగా చాలా కాలంగా టెస్టులు ఆడని జస్ప్రీత్ బుమ్రా కూడా టెస్టు క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో భాగంగా ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుతో భార‌త్ రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలుపొంద‌డం భార‌త్‌కు చాలా కీలకం. అయితే.. ద‌క్షిణాఫ్రికా గ‌డ్డపై భార‌త జ‌ట్టు ఇంత వ‌ర‌కు టెస్టు సిరీస్ గెల‌వ‌లేదు. ఈ సారి అయిన అంద‌ని ద్రాక్షగా ఉన్న సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని టీమిండియా పట్టుదలగా ఉంది. సఫారీ గడ్డపై తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్ వేదికగా, రెండో టెస్టు జవనరి 3 నుంచి 7 వరకు కేప్‌టౌన్ వేదికగా జ‌ర‌గ‌నుంది.
  

 

ఎనిమిది సిరీస్‌ల్లో ఏడు ఓడి...

టీమిండియా 1992 నుంచి 2022 వరకు సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో మొత్తం 8 టెస్టు సిరీస్‌లు ఆడింది. ఈ 8 సిరీస్‌లలో ఒకటి టై అయింది. మిగిలిన ఏడు సిరీస్‌లను భారత్ కోల్పోయింది. 2010-2011లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీమ్ ఇండియా 1-1తో సిరీస్‌ను సమం చేసింది. 2021-2022లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా మూడో టెస్టుల సిరీస్‌ను ఆడింది. ఆ సిరీస్‌ను 1-2తో భారత జట్టు ఓడిపోయింది. ఇప్పుడు ఈ ఏడాది తొలిసారిగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టెస్టు ఆడుతోంది. తొలి టెస్టు జరగనున్న సెంచూరియన్ సూపర్ స్పోర్ట్స్ పార్క్‌లో భారత్ ఇప్పటివరకూ మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు పరాజయాలు, ఒక విజయం ఉన్నాయి. ఈ మైదానంలో దక్షిణాఫ్రికా సగటు స్కోరు 315 పరుగులు కాగా, భారత్ 259 పరుగులు. సెంచూరియన్‌లో సఫారీల అత్యధిక స్కోరు 621 పరుగులు. ఈ మైదానంలో భారత్ అత్యధిక స్కోరు 459 పరుగులు. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇలా అన్ని ఓటములే ఉన్న దక్షిణాఫ్రికాలో టెస్ట్‌ సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది.

 

కోహ్లీ రాకతో బ్యాటింగ్ బలోపేతం

అనుమానాలకు చెక్‌ పెడుతూ టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లీ... దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. వచ్చి రావడంతోనే మైదానంలో చెమట చిందించాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన విరాట్‌ కోహ్లీ ఇటీవలే ‘ఫ్యామిలీ ఎమర్జెన్సీ’ అని చెప్పి తిరిగి స్వదేశానికి వచ్చాడు. ప్రత్యేకించి కారణం తెలియకపోయినా కోహ్లీ ఉన్నఫళంగా భారత్‌కు రావడం అనుమానాలకు తావిచ్చింది. అయితే సఫారీ జట్టుతో ఈనెల 26 నుంచి మొదలుకాబోయే తొలి టెస్టు నాటికి అతడు అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ మళ్లీ దక్షిణాఫ్రికాతో జట్టును కలిసిన కోహ్లీ... ప్రాక్టీస్‌ కూడా మొదలు పెట్టేశాడు. ప్రపంచకప్‌ తర్వాత మూడు వారాలు విశ్రాంతి తీసుకున్న రోహిత్‌ కూడా ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. కోహ్లీ, రోహిత్‌ నెట్స్‌లో చెమటోడ్చారు. ఇద్దరూ బ్యాటింగ్‌ సాధనపైనే దృష్టిసారించారు. మూడు గంటల పాటు సాగిన సాధనను చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షించాడు.