IPL 2023: ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అరుదైన ఘనతను అందుకున్నాడు. తన పేస్ తో ప్రత్యర్థులకు ఫస్ట్ ఓవర్ నుంచే చుక్కలు చూపిస్తున్న ఈ కివీస్ పేసర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 16 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసి పొదుపుగా బౌలింగ్ చేసిన బౌల్ట్ ఫస్ట్ ఓవర్ మెయిడిన్ కూడా చేశాడు. తద్వారా ఐపీఎల్ లో అత్యధికంగా ఫస్ట్ ఓవర్స్ మెయిడిన్ వేసిన వారి జాబితాలో సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రికార్డును సమం చేశాడు.
ఐపీఎల్ లో ఫస్ట్ ఓవర్ మెయిడిన్స్ వీరుల్లో టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ అందరికంటే ముందున్నాడు. ప్రవీణ్ కుమార్ 119 మ్యాచ్‌లలో 420 ఓవర్లు వేయగా అందులో ఫస్ట్ ఓవర్ మెయిడిన్లు 14 ఉన్నాయి. రెండో స్థానంలో భువనేశ్వర్ కుమార్.. 151 మ్యాచ్‌లలో 559 ఓవర్లు వేసి 11 మెయిడిన్లు వేశాడు. తాజాగా బౌల్ట్.. 83 మ్యాచ్ లలో 317 ఓవర్లు విసిరి 11 మెయిడిన్లు వేశాడు. ఈ క్రమంలో బౌల్ట్.. ఇర్ఫాన్ పఠాన్ (10 మెయిడిన్లు) రికార్డును బ్రేక్ చేశాడు. రాబోయే మ్యాచ్ లలో మరో రెండు మెయిడిన్లు వేస్తే అప్పుడు ఈ జాబితాలో బౌల్డ్ ఫస్ట్ ప్లేస్‌కు చేరతాడు.
బౌల్ట్ ప్రస్థానమిది..
ఐపీఎల్‌లో 2015 నుంచి ఆడుతున్న బౌల్ట్ ఇప్పటివరకు 83 మ్యాచ్ లలో 99 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ, ముంబై ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన అతడు.. ప్రస్తుతం రాజస్తాన్ తో కొనసాగుతున్నాడు. గత సీజన్ లో రాజస్తాన్ తరఫున 16 మ్యాచ్ లు ఆడి 16 వికెట్లు పడగొట్టిన బౌల్ట్.. ఈ సీజన్ లో ఇప్పటివరకు 5 మ్యాచ్ లలో 7 వికెట్లు పడగొట్టాడు. మరో వికెట్ పడగొడితే వంద వికెట్లు తీసిన బౌలర్ అవుతాడు.
ఇక లక్నోతో మ్యాచ్ లో బౌల్ట్ ఫస్ట్ ఓవర్ మెయిడిన్ కాగా రెండో ఓవర్లో రెండు పరుగులే వచ్చాయి. మూడో ఓవర్లో 13 పరుగులిచ్చాడు. చివరి ఓవర్లో ఒక్క పరుగే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
రాజస్తాన్ - లక్నో మధ్య జైపూర్ వేదికగా బుధవారం ముగిసిన 26వ లీగ్ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ (51) రాణించాడు. అనంతరం రాజస్తాన్.. లక్ష్య ఛేదనలో 11 ఓవర్లలో 87 పరుగులకు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయం దిశగా సాగింది. కానీ ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 20 ఓవర్లలో 144 మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో యశస్వి జైస్వాల్ (44), జోస్ బట్లర్ (40), దేవదత్ పడిక్కల్ (26) పోరాడిన ఫలితం దక్కలేదు.