Ranji Trophy Update: దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో భారత టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటం పక్కాగా మారింది. తదుపరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా జమ్ము కశ్మీర్‌తో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌కు తను అందుబాటులో ఉంటానని పేర్కొనడంతో రోహిత్ పేరును స్క్వాడ్‌లో చేర్చారు. అలాగే భారత టెస్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరును కూడా ఈ స్క్వాడ్‌లోకి చేర్చారు. ఇద్దరు కలిసి ఓపెనింగ్ చేసే అవకాశముంది. దాదాపు దశబ్ధ కాలం తర్వాత రోహిత్ డొమెస్టిక్ క్రికెట్ ఆడుతుండటం విశేషం. చివరిసారిగా 2014తో తను రంజీ మ్యాచ్ ఆడాడు. రంజీలకు సిద్ధమయ్యేందుకు ఇప్పటికే జట్టుతో కలిసిన రోహిత్, ప్రాక్టీస్ సెషన్లోనూ పాల్గొన్నాడు. ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ రంజీ ట్రోఫీలో ఆడతానని రోహిత్ పేర్కొన్నాడు. 

ఆడటం తప్పనిసరి..గతేడాదిగా భారత జట్టు టెస్టుల్లో అధ్వాన ప్రదర్శన చేస్తుంటడంతో బీసీసీఐ కఠిన వైఖరి అవలంభిస్తోంది. ఇప్పటికే టెన్ పాయింట్ రూల్‌ను తీసుకొచ్చిన బోర్డు.. అందులో దేశవాళీల్లో ఆడటం సహా అనేక నిబంధనలను పొందుపరిచింది. డొమెస్టిక్ క్రికెట్ ఆడితేనే జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తామని సూటిగా చెప్పింది. దీంతో ప్లేయర్లంతా దేశవాళీల్లో బరిలోకి దిగక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. అయితే ఫిట్ నెస్ సమస్యలు ఉంటే మాత్రం కాస్త మినహాయింపులు ఉండే అవకాశముంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఫిట్ నెస్ కారణంగానే దేశవాళీల్లో బరిలోకి దిగడం లేనట్లు తెలుస్తోంది. ఇక రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్, ప్రసిధ్ కృష్ణ తదితర ఆటగాళ్లు కూడా బరిలోకి దిగడం ఖాయంగా మారింది. 

పూర్ ఫామ్‌లో రోహిత్..గతేడాది కాలంగా రోహిత్ నిరాశ పరుస్తున్నాడు. ముఖ్యంగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో రోహిత్ తేలిపోయాడు. అందులో కేవలం 90 పరుగులు మాత్రమే చేసిన రోహిత్, తర్వాత ఆస్ట్రేలియా సిరీస్‌లో ఇంకా ఘోరంగా విఫలమయ్యాడు. మూడు టెస్టులు కలిపి కేవలం 31 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో ఆసీస్ గడ్డపై అత్యంత చెత్త ప్రదర్శన చేసిన పర్యాటక సారథిగా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ క్రమంలో సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో కెప్టెన్ అయి ఉండి, మ్యాచ్ నుంచి వైదొలగక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో జాతీయ జట్టులో రోహిత్ స్థానంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో తనను తాను నిరూపించుకోవాల్సిని పరిస్థితిలో పడిపోయాడు. రంజీల్లో టచ్‌లోకి వచ్చి, ఇంగ్లాండ్‌తో జరిగేమ మూడు వన్డేల సిరీస్ తోపాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి ప్రదర్శన చేస్తే తను జట్టులో కొనసాగుతాడు. లేకపోతే, మెగాటోర్నీనే చివరి అంతర్జాతీయ టోర్నీ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. 

Also Read: Rishabh Pant Captaincy: పంత్‌కే పగ్గాలు - లక్నో నూతన సారథి ప్రకటన, కొత్త జెర్సీ కూడా విడుదల