కపిల్ దేవ్ తర్వాత టెస్టు క్రికెట్‌లో భారత్‌కు నాయకత్వం వహించిన తొలి పేసర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించనున్నాడు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కూడా కెప్టెన్ రోహిత్ శర్మకు కోవిడ్-19 పాజిటివ్ రావడంతో ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రోహిత్ గైర్హాజరీలో బుమ్రా భారత్‌కు నాయకత్వం వహిస్తాడని వార్తలు వస్తున్నాయి.


లీసెస్టర్‌షైర్‌తో జరిగిన భారత టూర్ గేమ్‌ సమయంలో నిర్వహించిన కోవిడ్ టెస్టులో రోహిత్‌కు పాజిటివ్ అని తేలింది. మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రెండో ఇన్నింగ్స్‌లో పాజిటివ్‌గా తేలడంతో బ్యాటింగ్‌కు రాలేదు. భారత జట్టు బుధవారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేసింది. రోహిత్ ప్రాక్టీస్ కోసం బయటకు రాలేదని వార్తలు వస్తున్నాయి.


ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ టెస్టు సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. టీమిండియా రోహిత్ కెప్టెన్సీలో ఈ ఏడాది శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత్ నాలుగు టెస్టులు ముగిసేసరికి ఇంగ్లండ్‌పై 2-1 ఆధిక్యంలో ఉంది. అయితే భారత శిబిరంలో కోవిడ్ వ్యాప్తి కారణంగా ఐదో టెస్ట్ రీషెడ్యూల్ చేశారు.


బీసీసీఐ, ఈసీబీ ఈ ఏడాది మిగిలిన ఆ మ్యాచ్‌ను తిరిగి నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పర్యటనలో భారత్ టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు టీ20లు, మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఇంగ్లండ్ జట్టుకు బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.