Rohit Sharma T20 Wins Record: టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా వరుసగా 14 అంతర్జాతీయ టీ20 విజయాలు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. దాంతో పాటు ఓవరాల్‌గా వరుస 19 మ్యాచ్‌లలో భారత జట్టుకు విజయాలు అందించిన ఏకైక కెప్టెన్ సైతం హిట్ మ్యాన్. తదుపరి మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. ఓటమి లేకుండా అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా రోహిత్ నిలవనున్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రస్తుతం 20 వరుస విజయాలతో అగ్ర స్థానంలో ఉన్నాడు.


రోహిత్ కమ్ బ్యాక్.. వరుస విజయాలు..
కరోనా సోకడంతో రోహిత్ దూరం కావడంతో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో భారత్ ఓటమిపాలైంది. టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ జట్టుతో చేరడంతో కెప్టెన్సీకి బలం చేకూరింది. జట్టుకు రెండు వరుస టీ20లలో ఇంగ్లాండ్‌పై విజయాన్ని అందించాడు కెప్టెన్ రోహిత్ వర్మ. తొలి టీ20లో హిట్‌మ్యాన్‌ సేన నిర్దేశించిన 199 పరుగుల టార్గెట్‌ను ఆంగ్లేయులు ఛేదించలేకపోయారు. 148కే ఆలౌటయ్యారు. నిన్న జరిగిన రెండో టీ20లో సైతం బౌలర్లు సత్తా చాటడంతో భారత్ 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఛేదనలో ఇంగ్లండ్ 17 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో టీ20లలో వరుసగా 14వ విజయాన్ని అందించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు.


అరుదైన రికార్డుకు అడుగు దూరంలో..
ఇంగ్లాండ్‌పై రెండో టీ20లో విజయంతో కెప్టెన్‌గా 14 వరుస టీ20 విజయాలు అందించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ 19 వరుస మ్యాచ్‌లలో జట్టును విజయపథంలో నడిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉంది. పాంటింగ్ కెప్టెన్సీలో ఆసీస్ జట్టు వరుస 20 మ్యాచ్‌లలో ఘన విజయాలు అందుకుంది. 2003లో పాంటింగ్ ఈ ఘనత సాధించి, అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచాడు. అత్యధిక వరుస మ్యాచ్‌లలో ఓ జట్టును గెలిపించిన కెప్టెన్‌గా 19 ఏళ్ల నుంచి పాంటింగ్ పేరిటే రికార్డు ఉంది. ఒకవేళ నేడు (జూలై 10న) ఇంగ్లాండ్‌తో జరగనున్న 3వ టీ20లో భారత్ విజయం సాధిస్తే.. అత్యధిక విజయాలు అందించిన అంతర్జాతీయ కెప్టెన్‌గా పాంటింగ్ సరసన రోహిత్ నిలవనున్నాడు.


2019లో బంగ్లాదేశ్‌పై తొలిసారి భారత జట్టుకు సారథిగా వ్యవహరించాడు రోహిత్. ఇక అది మొదలుకుని నేటి వరకు మొత్తం 19 వరుస మ్యాచ్‌లలో టీమిండియాను విజయాల బాటలో నడిపించాడు. అందులో 14 టీ20 విజయాలు కావడం గమనార్హం.


Also Read: IND Vs ENG 2nd T20I Match Highlights: ఈ మ్యాచ్ బౌలర్లదే - సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా!