ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 49 పరుగులతో ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 17 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. జేసన్ రాయ్, జోస్ బట్లర్ లాంటి కీలక వికెట్లు పడగొట్టిన భువీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఆదుకున్న జడ్డూ..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (31: 20 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), రిషబ్ పంత్ (26: 15 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) మొదటి వికెట్‌కు 4.5 ఓవర్లలోనే 49 పరుగులు జోడించారు. అయితే కొత్త ఆటగాడు రిచర్డ్ గ్లీసన్ భారత్‌ను తొలి దెబ్బ తీశాడు. ఆ వెంటనే ఏడో ఓవర్లో విరాట్ కోహ్లీ (1: 3 బంతుల్లో), రిషబ్ పంత్‌లను కూడా అవుట్ చేసి గ్లీసన్ టీమిండియా టాప్ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. దీంతో టీమిండియా 61 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (15: 11 బంతుల్లో, రెండు ఫోర్లు), హార్దిక్ పాండ్యా (12: 17 బంతుల్లో, ఒక ఫోర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. క్రిస్ జోర్డాన్ వీరిద్దిరినీ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన దినేష్ కార్తీక్ ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. ఈ దశలో రవీంద్ర జడేజా స్కోరును పెంచే బాధ్యత తీసుకున్నాడు. చివర్లో హర్షల్ పటేల్ (13: 6 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) మెరుపులు మెరిపిండంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ నాలుగు వికెట్లు, రిచర్డ్ గ్లీసన్ మూడు వికెట్లు తీసుకున్నారు.
అదరగొట్టిన బౌలర్లు
180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ జేసన్ రాయ్‌ని (0: 1 బంతి) భువీ మొదటి బంతికే అవుట్ చేశాడు. ఆ తర్వాత మూడో ఓవర్లో జోస్ బట్లర్‌ను (4: 5 బంతుల్లో) అవుట్ చేసి మరో షాక్ ఇచ్చాడు. ఈ సిరీస్‌లో బట్లర్... భువీకి చిక్కడం ఇది రెండోసారి. ఐదో ఓవర్లో లివింగ్‌స్టోన్‌ను (15: 9 బంతుల్లో, మూడు ఫోర్లు) బుమ్రా అవుట్ చేయడంతో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది.
ఆ తర్వాత కాసేపటికే హ్యారీ బ్రూక్ (8: 9 బంతుల్లో, రెండు ఫోర్లు), డేవిడ్ మలన్ (19: 25 బంతుల్లో, రెండు ఫోర్లు), శామ్ కరన్ (2: 4 బంతుల్లో) కూడా అవుట్ కావడంతో ఇంగ్లండ్ 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మొయిన్ అలీ (35: 21 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), డేవిడ్ విల్లీ (33: 22 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఏడో వికెట్‌కు 34 పరుగులు జోడించారు. అనంతరం మొయిన్ అలీ అవుటయ్యాక, మిగతా ఇంగ్లండ్ బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో ఇంగ్లండ్ 17 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో భువీ మూడు వికెట్లు తీసుకోగా... బుమ్రా, చాహల్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. హార్దిక్ పాండ్యా, హర్షల్ పటేల్‌లకు చెరో వికెట్ దక్కింది.