ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (46 నాటౌట్: 29 బంతుల్లో, ఐదు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (31: 20 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), రిషబ్ పంత్ (26: 15 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) మొదటి వికెట్‌కు 4.5 ఓవర్లలోనే 49 పరుగులు జోడించారు. అయితే కొత్త ఆటగాడు రిచర్డ్ గ్లీసన్ భారత్‌ను తొలి దెబ్బ తీశాడు. ఆ వెంటనే ఏడో ఓవర్లో విరాట్ కోహ్లీ (1: 3 బంతుల్లో), రిషబ్ పంత్‌లను కూడా అవుట్ చేసి గ్లీసన్ టీమిండియా టాప్ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. దీంతో టీమిండియా 61 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (15: 11 బంతుల్లో, రెండు ఫోర్లు), హార్దిక్ పాండ్యా (12: 17 బంతుల్లో, ఒక ఫోర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. క్రిస్ జోర్డాన్ వీరిద్దిరినీ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన దినేష్ కార్తీక్ ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. ఈ దశలో రవీంద్ర జడేజా స్కోరును పెంచే బాధ్యత తీసుకున్నాడు. చివర్లో హర్షల్ పటేల్ (13: 6 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) మెరుపులు మెరిపిండంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ నాలుగు వికెట్లు, రిచర్డ్ గ్లీసన్ మూడు వికెట్లు తీసుకున్నారు.