Rohit Sharma On Shreyas Iyer: ఈ ఏడాది బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా అహ్మదాబాద్‌లో ముగిసిన నాలుగో టెస్టు నుంచి గాయం కారణంగా అర్థాంతరంగా తప్పుకున్న  మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్‌‌పై టీమిండియా సారథి   రోహిత్ శర్మ కీలక అప్డేట్ ఇచ్చాడు. ఏప్రిల్‌లో  లోయర్ బ్యాక్ (వెన్ను గాయం) కు ఆపరేషన్  చేయించుకున్న అయ్యర్..  కొద్దికాలంగా  బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ)లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.  


అయ్యర్ కమ్‌బ్యాక్ ఎప్పుడు..? అన్నదానిపై ఇంకా సందిగ్ధత వీడలేదు.  ఎన్సీఎలో  కెఎల్ రాహుల్‌తో కలిసి   రీహాబిటేషన్ పొందుతున్న అయ్యర్ గురించి  రోహిత్ తాజాగా స్పందిస్తూ.. ‘శ్రేయాస్ ప్రస్తుతం  ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించేదిశగా సన్నద్ధమవుతున్నాడు.  వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఆడే ఆటగాళ్ల రేసులో అతడు కూడా ఉంటాడు’ అని చెప్పాడు. 


 






వెస్టిండీస్‌తో  టెస్టులు, వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అక్కడ్నుంచి నేరుగా అమెరికాకు వెళ్లిన రోహిత్ అక్కడ  ఓ కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశాడు.   హిట్‌మ్యాన్ వ్యాఖ్యల నేపథ్యంలో  అయ్యర్  పూర్తిగా కోలుకున్నట్టేనన్న వాదనలూ వినిపిస్తున్నాయి. గత మేలో తొడ గాయానికి సర్జరీ చేయించుకుని ఎన్సీఎలో ఉంటున్న  రాహుల్ కూడా బ్యాటింగ్, వికెట్ కీపింగ్  ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆసియా కప్‌కు   శ్రేయాస్ అయ్యర్ అందుబాటులో ఉండేది కొంచెం కష్టమే అయినా రాహుల్ మాత్రం  పూర్తి ఫిట్నెస్ సాధించాడని, అతడు సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. అయ్యర్ మాత్రం  సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని  తెలుస్తున్నది. 


నిన్నా మొన్నటిదాకా శ్రేయాస్, రాహుల్‌తో పాటు పేసర్ జస్ప్రిత్ బుమ్రా  కూడా ఎన్సీఎలోనే ఉన్నాడు. ఇప్పటికీ  అతడు ఎన్సీఎలోనే ఉన్నా  అతడు పూర్తి స్థాయిలో కోలుకోవడంతో  ఐర్లాండ్ సిరీస్‌లో అతడు సారథ్య బాధ్యతలు మోయనున్నాడు. 


2024 టీ20 వరల్డ్ కప్ ఆడతా : రోహిత్ శర్మ 


వచ్చే ఏడాది జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో తాను ఆడతానని హిట్‌మ్యాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 2024లో ఇక్కడకు తప్పకుండా వస్తానని  చెప్పడం  గమనార్హం.  రోహిత్ మాట్లాడుతూ..‘వచ్చే ఏడాది  వెస్టిండీస్, అమెరికాలలోనే  పొట్టి ప్రపంచకప్ జరగాల్సి ఉంది.  నేను ఇప్పుడు ఇక్కడకు రావడానికి కూడా అదే కారణం.  అప్పటివరకూ అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారని నేను ఆశిస్తున్నా. నాక్కూడా  బరిలోకి దిగాలనే ఉంది..’ అని చెప్పాడు.   ఈ వ్యాఖ్యల ద్వారా  వచ్చే వరల్డ్ కప్‌లో తాను కూడా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని రోహిత్ చెప్పకనే చెప్పాడు. వాస్తవానికి  గతేడాది ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో  సెమీస్‌లె ఇంగ్లాండ్ చేతిలో ఓడిన తర్వాత   రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి సీనియర్లు అంతర్జాతీయ స్థాయిలో ఒక్క టీ20 కూడా  ఆడలేదు.   టీ20 వరల్డ్ కప్ - 2‌‌024ను దృష్టిలో ఉంచుకుని  బీసీసీఐ.. యువ ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశాలిస్తోంది. 





















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial