Rohit Sharma Latest News: మా గురించి దుష్ప్రచారం చేయొద్దు, ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
Rohit Sharma Retirement | ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనంతరం వన్డే ఫార్మాట్ నుంచి రోహిత్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని జరిగిన ప్రచారంపై స్పందించాడు. తాను రిటైర్ కావాలనుకోవడం లేదని స్పష్టం చేశారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. కీలకమైన మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్న రోహిత్ శర్మ తన కెరీర్ ప్లాన్ పై స్పందించాడు. తాను వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ కావడం లేదని స్పష్టం చేశాడు. తాను రిటైర్ అవుతున్నానంటూ దుష్ప్రచారం చేయవద్దని సైతం రోహిత్ శర్మ సూచించాడు. మరికొన్నేళ్ల పాటు వన్డేలు ఆడతానని చెప్పడంతో 2027 వన్డే వరల్డ్ కప్ నెగ్గడమే రోహిత్ శర్మ బిగ్ టార్గెట్ అని హాట్ టాపిక్ అవుతోంది.
దుబాయ్ మా హోం గ్రౌండ్ కాదు..
మాకు మద్దతు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. దుబాయ్ (Dubai) మాకు హోమ్ గ్రౌండ్ కాదు కానీ ప్రేక్షకుల మద్దతుతో దీన్ని మా హోమ్ గ్రౌండ్‌గా మార్చారు. ఈ విజయం చాలా సంతృప్తినిచ్చింది. మా స్పిన్నర్లపై ఎన్నో చాలా అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా వారు రాణించారు. మంచి బౌలింగ్‌తో టోర్నీకి వచ్చాం. కేఎల్ రాహుల్ స్థిరంగా ఉన్నాడు. నిలకడగా ఆడుతూ ఒత్తిడికి ఎప్పుడూ భయపడలేదు. ఒత్తిడిలో తను సరైన షాట్లను ఎంచుకుంటాడు. బ్యాటర్లు కీలక సమయంలో రాణించి పరుగులు చేశారు. వరుణ్ చక్రవర్తిలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. ఇలాంటి పిచ్‌లపై ఆడితే జట్టులో కచ్చితంగా వరుణ్ లాంటి ఆటగాళ్లు ఉండాలని కెప్టెన్ కోరుకుంటాడు. మొదట్లో ఆడకపోయినా, తరువాత అవకాశాలు సద్వినియోగం చేసుకుని వికెట్ల వేట కొనసాగించాడు. మాకు ఎంతో మద్దతు తెలిపిన అభిమానుకు థ్యాంక్స్. వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు.
ఆచితూచి కాదు.. దూకుడే మంత్రంగా ప్రయోగం
‘గతంలో వరల్డ్ కప్ ముందు అప్పటి కోచ్ రాహుల్ ద్రావిడ్ తో మాట్లాడా. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సైతం కోచ్ గౌతం గంభీర్ తో నా బ్యాటింగ్ గురించి మాట్లాడాను. భిన్నంగా ట్రై చేయాలని, జట్టు కోసం నా శైలిని మార్చుకుని మొదట్నుంచీ దూకుడుగా ఆడాలని చర్చించా. కొన్ని ప్రయోగాలు చేసినప్పుడు అన్ని ఫలితాలు మనకు అనుకూలంగా రావు. స్వభావాన్ని బట్టి అర్థం చేసుకుని ఆడటం కాకుండా, అటాకింగ్ మోడ్ లోకి వెళ్లాను. జట్టు ప్లాన్ ప్రకారం చాలా వరకు అమలు చేశాం. మాకు బ్యాటింగ్ లో డెప్త్ ఉంది. 5, 6 వికెట్లు తరువాత సైతం జడేజా బ్యాటింగ్ కు వస్తాడు. దాంతో చివర్లో వాళ్లు ఫినిష్ చేస్తారని గట్టిగా నమ్మేవాడ్ని. అందువల్లే చాలా మ్యాచ్ లలో వేగంగా ఆడేందుకు ప్రయత్నించి వికెట్లు సమర్పించుకున్నానని’ రోహిత్ శర్మ తెలిపాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మొదట న్యూజిలాండ్ ను 50 ఓవర్లలో 7 వికెట్లకు 251కే కట్టడి చేసిన భారత్ మరో 6 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఛాంపియన్స్ ట్రోఫీని మూడు సార్లు నెగ్గిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. గంగూలీ కెప్టెన్సీలో ఒకసారి, ధోనీ సారథ్యంలో ఒకటి, తాజాగా రోహిత్ శర్మ మూడో కప్ అందించాడు.