Rohit Sharma Retirement News | ఇంగ్లాండ్‌తో జరిగే మూడో వన్డే తర్వాత భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించనున్నారని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. బీసీసీఐ అతడికి ముందే చెప్పిందని, దాంతో హిట్ మ్యాన్ వన్డే వరల్డ్ కప్ 2027 ప్రాబబుల్స్ లో కూడా ఉండడని చర్చ జరిగింది. కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్టర్ అజిత్ అగార్కర్ సైతం రోహిత్ శర్మతో మాట్లాడటం పూర్తయిందని.. రిటైర్మెంట్ ప్రకటించడమా.. లేక వన్డే వరల్డ్ కప్ రేసులో లేడని తేలిపోవడమో జరగుతుందని అంతా అనుకున్నారు. తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి రిటైర్మెంట్ వార్తలు వింటూనే ఉన్నానని, వారిని మనం అడ్డుకోలేం అని.. స్టేడియం బయట కొందరికి చాలా మజాగా ఉంటుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆ తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా ఈ వార్తలను ఇదివరకే ఖండించారు. 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో రోహిత్ భాగం అవుతారా లేదా అనే విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. తాను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వచ్చిన వార్తలపై రోహిత్ శర్మ తొలిసారి స్పందించారు. లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో, చివరి వన్డే ముగిసిన తర్వాత రోహిత్ తనపై వచ్చిన వదంతులపై తనదైన శైలిలో స్పందించాడు.
లార్డ్స్ స్టేడియంలో వన్డే సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్
ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ (138 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్) సాధించాడు. లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. భారత ఓపెనర్ రోహిత్ 110 బంతుల్లో 5 సిక్సర్లు, 17 ఫోర్లు బాది స్కోరు బోర్డును నడిపించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి గట్టి పునాది వేశాడు. ఆ తర్వాత ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీతో కలిసి కూడా శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు రోహిత్. అయితే భారత్ ఈ మ్యాచ్‌లో చివరివరకూ పోరాడి ఓడిపోయింది.
రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘మేం బర్మింగ్‌హామ్‌లో విజయంతో మంచి ప్రారంభాన్ని అందుకున్నాం. కానీ రెండో వన్డే జరిగిన కార్డిఫ్‌లో ఓడిపోయాం. ఈ రోజు బ్యాటింగ్‌లో మంచి ఆరంభం లభించడంతో విజయంపై ఆశలు పెట్టుకున్నాం. చివరివరకూ పోరాడి మళ్లీ ఓడిపోయామని’ అన్నాడు.
రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ రియాక్షన్..
‘నాకు తెలిసిన పని బాగా బ్యాటింగ్ చేయడం. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం. నేను అరంగేట్రం చేసినప్పటి నుండి ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. భారత్‌కు ఆడుతున్నంత కాలం ఇలాంటి మాటలు వింటూనే వచ్చాను. ఇవేవీ నాకు ముఖ్యం కాదు. మైదానంలో బరిలోకి దిగి పరుగులు చేస్తున్నానా లేదా అనేది మాత్రమే నాకు ముఖ్యం. నేను నా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రతీసారి ప్రయత్నిస్తాను. జట్ట విజయంలో నా వంతు పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం దానిపైనే ఫోకస్ చేశాను. కొందరు మైదానం బయట నా గురించి ఏవో ప్రచారం చేస్తుంటారు. వాటిని అలాగే జరగనివ్వండి, ఇవి లేకపోతే జీవితంలో మజానే ఉండదు. నా పని స్టేడియం లోపలే ఉంది. వారి పని బయట చేస్తున్నారని’ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.
సిరీస్ డిసైడ్ చేసే చివరి వన్డేలో మంచి ఆరంభం లభించినప్పటికీ ఓడిపోవడంతో నిరాశ చెందాను. మేం కొన్ని రన్స్ తక్కువగా చేశాం. బౌలింగ్ విషయానికి వస్తే, ఎక్కువ వన్డే క్రికెట్ ఆడని ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని అందరూ అర్థం చేసుకోవాలి. వారికి సెటిల్ కావడానికి కొంత సమయం ఇవ్వాలి. ఇంగ్లాండ్‌లో ఆడటం తనకు చాలా ఇష్టమని, అయితే లార్డ్స్ వన్డే ఇన్నింగ్స్‌ను బాగా ఎంజాయ్ చేశానని, కానీ మ్యాచ్ రిజల్ట్ నిరాశకు గురిచేసింది - రోహిత్ శర్మ
