Rohit Sharma's Special Message For Dhawal Kulkarni After Ranji Win:  ముంబై జట్టు 42వసారి రంజీ ట్రోఫీ(Ranji Trophy గెలవడంలో కీలక పాత్ర పోషించిన  సీనియర్ ఆటగాడు ధవళ్ కులకర్ణి(Dhawal Kulkarni) క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ సీజన్‌ తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటిస్తానని ముందే చెప్పిన కుల్‌కర్ణీ... తన కెరీర్‌ను ముగించాడు. ముంబై జట్టు తరపున ఆరు ఫైనల్స్‌లో ఆడిన ధవళ్ ఐదింట్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రహానెతో కలిసి అండర్‌ -14, అండర్‌ -19 విభాగాల్లో ధవళ్‌ కులకర్ణి ఆడాడు. ఇతను జాతీయ జట్టు తరఫున 2014లో అరంగేట్రం చేసినా ఎక్కువగా అవకాశాలు రాలేదు. 12 వన్డేలు, 2 టీ20లను మాత్రమే ఆడాడు. ఐపీఎల్‌లో 92 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 95 మ్యాచుల్లో 281 వికెట్లు తీశాడు. 15 సార్లు ఐదు వికెట్లు, ఒక‌సారి 10 వికెట్ల ప్రద‌ర్శన చేశాడు. ధవళ్ కులకర్ణి క్రికెట్‌కు వీడ్కోలు పలికడంపై భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) త‌న మాజీ స‌హ‌చ‌రుడైన కుల‌క‌ర్ణిపై ప్రశంస‌లు గుప్పించాడు. ముంబై యోధుడు. తన కెరీర్ అద్భుతంగా సాగినందుకు అభినంద‌న‌లని  హిట్‌మ్యాన్ అన్నాడు.  కుల‌క‌ర్ణి 2008లో ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు.



ఛాంపియన్‌ ముంబై
దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో తమకు ఎదురులేదని ముంబై మరోసారి  చాటిచెప్పింది. రికార్డు స్థాయిలో 42వ సారి టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. హోరాహోరీగా జ‌రిగిన ఫైన‌ల్లో విద‌ర్భను మ‌ట్టిక‌రిపించి 8 ఏళ్ల త‌ర్వాత ముంబై టైటిల్‌ను ముద్దాడింది. చివరిసారిగా 2015-16 సీజన్‌లో సౌరాష్ట్రను ఓడించి ముంబై ఛాంపియన్‌ అయింది. ఫైనల్లో భారీ లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా విదర్భ పోరాటం ఆకట్టుకుంది. 



ఫైనల్‌ మ్యాచ్‌లో విదర్భపై 169 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 350/5 స్కోరుతో విజయం దిశగా సాగిన విదర్భను ముంబయి బౌలర్లు కట్టడి చేయగలిగారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు తీసి జట్టును గెలిపించారు. విదర్భ కెప్టెన్ అక్షయ్ వడ్కర్ సెంచరీ సాధించి జట్టును గెలిపించేందుకు చివరి వరకూ పోరాడాడు. ముంబై బౌలర్లు తనుష్ కొటియన్ 4, ముషీర్ ఖాన్ 2, తుషార్‌ దేశ్‌ పాండే 2.. శార్దూల్, షామ్స్‌ ములాని చెరో వికెట్‌ తీశారు. సెంచ‌రీ హీరో ముషీర్ ఖాన్ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకోగా.. ముంబై బౌలర్‌ త‌నుష్ కొటియాన్ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుపొందాడు. 



ముంబై జట్టుకు "డబుల్‌ నజరాన"
 రికార్డుస్థాయిలో 42వసారి రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టుకు... ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ నజరాన ప్రకటించింది. జట్టు సభ్యులకు రంజీ ట్రోఫీ ప్రైజ్‌మనీతోపాటు డబుల్‌ నజరానాను ముంబయి క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రైజ్‌మనీ వచ్చేదానితోపాటు అదనంగా రూ.5 కోట్లను ముంబై జట్టుకు ఇవ్వనున్నట్లు MCA తెలిపింది. రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై జట్టు సభ్యులకు ప్రైజ్‌మనీని డబుల్‌ ఇవ్వాలని భావించామని... ఈ సీజన్‌లో ముంబై ఏడు టైటిళ్లు సాధించిందని... MCA కార్యదర్శి అజింక్యా నాయక్ తెలిపారు. అందుకే వారికి నజరాన ప్రకటించాలని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అమోల్‌ ఖేర్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.