Rishabh Pant on comeback: టీమిండియా (Team India)అభిమానులకు శుభవార్త అందింది. రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా వికెట్ కీపర్, విధ్వంసకర ఆటగాడు రిషభ్ పంత్(Rishabh Pant) పూర్తిగా కోలుకున్నాడు. ఏడాది పాటు ఆటకు దూరమైన పంత్‌... ఐపీఎల్‌లో ఆడేందుకు పూర్తి ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. పంత్‌ వికెట్‌ కీపింగ్‌ కూడా చేసేంత ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ ప్రకటించడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ శిబిరంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. మళ్లీ ఆ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించబోతున్నాడు. ఈ క్రమంలో పంత్‌ తన మనసులోని మాటను బయటపెట్టాడు. గాయం తర్వాత తన ప్రయాణం ఎలా  సాగిందో గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు.

పంత్‌ ఏమన్నాడంటే....?
తాను మళ్లీ క్రికెట్‌ మైదానంలో దిగనుండడం ఎంతో ఉత్సాహంగా ఉందని పంత్‌ అన్నాడు. అదే సమయంలో కొంచెం ఒత్తిడికి గురవుతున్నానని... తాను మళ్లీ అరంగేట్రం చేస్తున్న భావన కలుగుతోందని పంత్‌ అన్నాడు. తిరిగి క్రికెట్‌ ఆడటం అంటే ఒక అద్భుతంలా అనిపిస్తోందని కష్ట సమయంలో ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన అభిమానులు, బీసీసీఐ, ఎన్‌సీఏకు పంత్‌ ధన్యవాదాలు తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుతో కలిసేందుకు అభిమానుల ముందు ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పంత్‌ తెలిపాడు. 


అభిమానుల సంబరాలు
ఇప్పటికే పంత్‌ నెట్స్‌లో పూర్తి స్థాయి ప్రాక్టీస్ ప్రారంభించాడు. బ్యాటింగ్‌తో పాటు కీపింగ్, ఫీల్డింగ్ సాధన మొదలు పెట్టాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు కూడా ఆడాడు. పంత్‌ పూర్తిగా కోలుకున్నాడని.. అతను ఐపీఎల్‌లో దిగేందుకు సిద్ధంగా ఉన్నాడని బీసీసీఐ వెల్లడించింది. ఈ ప్రకటనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆనందం వ్యక్తం చేసింది. రిషభ్ పంత్ కోలుకోవడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంత్ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 



డాక్టర్‌ ఏమన్నాడంటే..?
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రిషభ్‌పంత్‌కు కోకిలాబెన్‌ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ దిన్షా పార్దీవాలా చికిత్స అందించారు. అతడికి చికిత్స చేసిన కిత్స సమయంలో జరిగిన పలు ఆసక్తికర పరిణామాలను పార్దీవాలా బీసీసీఐ టీవీతో పంచుకొన్నారు. సాధారణంగా మోకాలికి తీవ్ర గాయమైతే కోలుకోవడమే కష్టమని.... అలాంటిది క్రికెట్‌ ఆడటం అంటే ఓ అద్భుతమేనని... ఈ అద్భుతాన్ని పంత్‌ సాధించాడని పార్దీవాలా గుర్తు చేసుకున్నారు. అనుకొన్న సమయం కంటే మూడు నెలల ముందే పంత్‌ మైదానంలోకి అడుగుపెట్టడం సామాన్యమైన విషయం కాదని పార్దీవాలా అన్నారు. పంత్‌ ఆస్పత్రిలో చేరాక కుడి మోకాలికి ఏకంగా మూడు ఆపరేషన్లు చేశారని.... పాదం, మణికట్టు ఎముకలు విరిగాయని... దిన్షా పార్దీవాలా గుర్తు చేసుకున్నారు. నువ్వు క్రికెట్‌ ఆడేందుకు కనీసం 18 నెలలు పడుతుందని తాను పంత్‌తో చెప్పానని... కానీ తాను 12 నెలల్లో తిరిగి మైదానంలో అడుగు పెడతానని అన్నాడని.... డాక్టర్‌ తెలిపాడు. తీవ్రంగా శ్రమించిన పంత్‌ తాను అనుకున్న దానికంటే మూడు నెలల ముందే టీ 20 క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడని దిన్షా పార్దీవాలా వెల్లడించారు.