Rohit Century: రోహిత్ శర్మ రాజసం.. 32వ సెంచరీతో సత్తా.. విమర్శలకు బ్యాట్ తో హిట్ మ్యాన్ సమాధానం
గతేడాదిగా విఫలమై, విమర్శల పాలైన రోహిత్..కటక్ ఇన్నింగ్స్ తో తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు. బ్యాటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి బౌండరీలు, సిక్సర్లతో దూకుడుగా ఆడుతూ పాత హిట్ మ్యాన్ ను గుర్తుకు తెచ్చాడు.

Ind Vs Eng Odi Updates: భారత అభిమానులు ఆకలి ఎట్టకేలకు తీరింది. విందు భోజనం లాంటి ఇన్నింగ్స్ తో భారత వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో మెరుపు సెంచరీ (75 బంతుల్లో 102 నాటౌట్, 9 ఫోర్లు, 7 సిక్సర్లు)తో రోహిత్ సత్తా చాటాడు. గతేడాది కాలంగా విఫలమై, విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్.. కటక్ ఇన్నింగ్స్ తో తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు. భారత బ్యాటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి బౌండరీలు, సిక్సర్లతో దూకుడుగా ఆడుతూ పాత హిట్ మ్యాన్ ను గుర్తుకు తెచ్చాడు. కళ్లు చెదిరే తన మార్కు పుల్ షాట్లతో అభిమానులను అలరించాడు.
ఆదివారం మ్యాచ్ చూసిన అభిమానులు పులకరించే పోయేలా అత్యద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే అట్కిన్సన్ బౌలింగ్ లో ఫోర్, సిక్సర్ కొట్టిన రోహిత్, తర్వాత ఓవర్లో మహ్మూద్ బౌలింగ్ లో కళ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు. దీంతో 6 ఓవర్లలో 48 పరుగులతో తూఫాన్ ఆరంభం లభించింది. ఫ్లడ్ లైట్ల వైఫల్యం కారణంగా కాసేపు మ్యాచ్ ఆగిపోయినా, మొదలైన తర్వాత రోహిత్ తన జోరును ఆపలేదు. ఈ క్రమంలో 30 బంతుల్లోనే ఫిఫ్టీ చేసుకున్నాడు. ఆ తర్వాత బౌండరీలతోనే డీల్ చేస్తూ 32వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. సిక్సర్ తో రోహిత్ సెంచరీ చేసిన తీరు అమోఘం. మధ్యలో శుభమాన్ గిల్ (60), విరాట్ కోహ్లీ (5) ఔటైనా ఏకాగ్రతను హిట్ మ్యాన్ కోల్పోలేదు. అంతకుముందు గిల్ తో తొలి వికెట్ కు 136 పరుగులు జోడించాడు .
గాడిన పడినట్లేనా..?
టీమిండియాలో రోకో పేరుతో రోహిత్, కోహ్లీ చాలా ప్రసిద్ధి. భారత్ ను చాలాకాలంపాటు వేధిస్తున్న రోకో వైఫల్యాలలో కటక్ ఇన్నింగ్స్ తో రో కు సమాధానం దొరికింది. అదే రోహిత్ శర్మ తిరిగి ఫామ్ లోకి రావడం శుభపరిణామం. ముఖ్యంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మరో 11 రోజుల్లో మొదలు కాబోతున్న నేపథ్యంలో రోహిత్ తన దైన శైలిలో ఫామ్ ను దొరకబుచ్చుకున్నాడు. ఇక కటక్ ఇన్నింగ్స్ విషయానికొస్తే, ఆరంభం నుంచి ఎలాంటి తడబాటు లేకుండా ఫ్రీగా ఆడిన రోహిత్.. పరిస్థితులకు తగినట్లుగా తన ఆటతీరు మార్చుకున్నాడు. మధ్యలో రెండు వికెట్లు పడినా జట్టును విజయం దిశగా నడిపించేందుకు ఓపికగా ఆడాడు.
ఆ ఓక్కటి పూర్తయితే..
సీనియర్ బ్యాటర్ విరాట్ కూడా ఫామ్ లోకి వస్తే భారత్ కష్టాలు తీరిపోయినట్లే. కటక్ ఇన్నింగ్స్ లో మంచి టచ్ లో కనిపించిన విరాట్.. క్లాసిక్ స్ట్రైట్ డ్రైవ్ తో ఖాతా తెరిచాడు. అయితే ఆదిల్ రషీద్ బౌలింగ్ లో బంతి అనూహ్యంగా తిరగడంలో అన్ లక్కీగా ఔటయ్యాడు. ఇక అహ్మదాబాద్ లో జరిగే మూడో వన్డేలోనైనా కోహ్లీ ఫామ్ దొరకబుచ్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read: Varun Record: వరుణ్ ఖాతాలో మరో రికార్డు- అతి పెద్ద వయసులో డెబ్యూ.. 1974 తర్వాత ఇదే తొలిసారి..