Ind Vs Eng 2nd Odi Live Updates: బ్యాటర్లు రాణించడంతో కటక్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మరోసారి పూర్తి కోటా ఓవర్లను బ్యాటింగ్ చేయలేక పోయింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ చాలా మంచి ఇన్సింగ్స్ (72 బంతుల్లో 69, 6 ఫోర్లు)తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ బెన్ డకెట్ ఫాస్టెస్ట్ అర్థ సెంచరీ (56 బంతుల్లో 65, 10 ఫోర్లు)తో రాణించాడు. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (3/35) పొదుపుగా బౌలింగ్ చేసి సత్తా చాటాడు. అంతకుముందు ఈ మ్యాచ్ లో భారత్ రెండు మార్పులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్థానంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ స్థానంలో వరుణ్ చక్రవర్తి డెబ్యూ చేశాడు. యశస్వి జైస్వాల్ ప్లేసులో శుభమాన్ గిల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు.
అంచనాలను అందుకున్న వరుణ్..ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన వరుణ్ చక్రవర్తి తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. ఆరంభంలో ఇంగ్లాండ్ ఓపెనర్లు సాల్ట్, డకెట్ రెచ్చిపోవడంతో ఎనిమిది పరుగులకు పైగా పరుగులు సాధించారు. ఈ దశలో బౌలింగ్ కు వచ్చిన వరుణ్.. ఫిల్ సాల్ట్ (26) వికెట్ తీసి 81 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. అయితే మరో ఎండ్ లో బకెట్ మాత్రం రెచ్చిపోయాడు. ఉన్నంత సేపు బౌండరీలు బాదుతూ ఆకట్టుకున్నాడు. తన బౌలింగ్ లో పది బౌండరీలు ఉండటం విశేషం. అతనికి రూట్ తోడవడంతో అగ్నికి వాయువు తోడయినట్లయింది. అయితే ఫిఫ్టీ అయిన తర్వాత డకెట్ పెవిలియన్ కు చేరాడు. ఈ దశలో రూట్ తో కలిసి, హారీ బ్రూక్ (31), కెప్టెన్ బట్లర్ (34) ఓపికగా ఆడి, చక్కని భాగస్వామ్యాలు నమోదు చేశారు.
మలుపు తిప్పిన జడేజా..ఫిఫ్టీ చేసి సెంచరీ దిశగా సాగుతున్న రూట్ ను జడేజా బోల్తా కొట్టించడం ఇన్నింగ్స్ కే హైలెట్. భారీ షాట్ కు ప్రయత్నిస్తుడాని తెలిసి, కాస్త దూరంగా బంతిని వేయడంతో బంతిని టైమ్ చేయలేక లాంగాఫ్ లో కోహ్లీ చేితికి చిక్కాడు. అటు పొదుపుగా బౌలింగ్ చేయడంతోపాటు ఇటు మూడు వికెట్లు కూడా తీసి ఇంగ్లాండ్ ను కట్టడిచేశాడు. దీంతో ఒక దశలో 330+ స్కోరు వెళుతుందనుకున్న ఇంగ్లాండ్, ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. చివర్లో లియామ్ లివింగ్ స్టన్ (41) బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లాండ్ 300 పరుగుల మార్కును దాటింది. చివర్లో మూడు రనౌట్లు కావడం కూడా ఇంగ్లాండ్ కొంప ముంచింది. బౌలర్లలో మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తికి తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో గెలవడం ఇంగ్లాండ్ కు తప్పనిసరి. ఇప్పటికే సిరీస్ లో 0-1తో వెనుకంజలో నిలిచిన బట్లర్ సేన, ఈ మ్యాచ్ లో ఓడితే సిరీస్ చేజారుతుంది. ఇక ఈ మ్యాచ్ లోనే గెలిచి మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ దక్కించుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. తద్వారా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని యోచిస్తోంది.
Read Also: Varun Record: వరుణ్ ఖాతాలో మరో రికార్డు- అతి పెద్ద వయసులో డెబ్యూ.. 1974 తర్వాత ఇదే తొలిసారి..