Ind Vs Eng 2nd Odi Live Updates: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే ప్రారంభమైంది. కటక్ లో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బౌలింగ్ చేయనుంది. మోకాలి గాయం నుంచి కోలుకుని ఈ మ్యాచ్ లోకి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టులోకి వచ్చాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫై వేటు పడింది. కుల్దీప్ యాదవ్ ప్లేసులో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి డెబ్యూ చేశాడు. ఈ మ్యాచ్ లో నెగ్గి మూడు వన్డేల సిరీస్ ను దక్కించుకోవాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే సిరీస్ లో ఇండియా 1-0తో ఆధిక్యంలో ఉంది. భారత జట్టు రోహిత్, కోహ్లీ, శుభమాన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తదితర స్టార్లతో బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్ ఓడిపోయి విమర్శల పాలైన ఇంగ్లాండ్.. తొలి వన్డేలోనూ ఓడి ఒత్తిడిలో ఉంది. జట్టులో మూడు మార్పులు చేసింది. మార్క్ వుడ్, అట్కిన్సన్, ఓవర్టన్ జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్ లో నెగ్గి ఎలాగైనా సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. బ్యాటింగ్ కు స్వర్గధామంగా పిచ్ ను రూపొందించారు. రాత్రి పూట మంచు కురుస్తుందని అంచనా ఉంది.
అందరి ఫోకస్ పై రోకో పైనే..ఈ మ్యాచ్ లో అందరి ఫోకస్ టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్, కోహ్లీ పైనే ఉంది. గత కొంతకాలంగా అంతర్జాతీయం విఫలమవుతూ, జట్టులో వాళ్ల స్థానాలపై అందరికీ పలు సందేహాలు ముసురుకుంటున్నాయి. తొలి వన్డేలో ఆడిన రోహిత్ కేవలం 2 పరుగులకే ఔటవ్వగా, విరాట్ మాత్రం గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో సత్తా చాటి విమర్శకలు నోళ్లు మూయించడంతోపాటు, రాబోయే ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవ్వాలని వీళ్లిద్దరూ భావిస్తున్నారు. ఇక జట్టులో గిల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ లతో బ్యాటింగ్ బలంగా ఉంది. ఆల్ రౌండర్ గా జడేజా బంతితో సఫలమైనా, బ్యాట్ తో రాణించాల్సి ఉంది. ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకోవడంతో బౌలింగ్ విభాగం దుర్బేధ్యంగా మారింది. దీంతో ఈ మ్యాచ్ లోనే గెలిచి సిరీస్ పట్టయ్యాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
మూడు మార్పులతో బరిలోకి..పిచ్ నుంచి పేసర్లకు సహకారం ఉండనుందన్న అంచనాతో ఇంగ్లాండ్ కొన్ని మార్పులు చేసింది. జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెతెల్, బ్రైడెన్ కార్స్ ల స్థానాల్లో జామీ ఓవర్టన్, మార్క్ వుడ్, సాఖిబ్ మహ్మూద్ లను తీసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో నెగ్గడం ఇంగ్లాండ్ కు తప్పనిసరి. ఓడిపోతే సిరీస్ కోల్పోయే ప్రమాదముంది. మెగాటోర్నీకి ముందు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే కనీస పోటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. జట్టులో హిట్టర్లకు లోటు లేకపోయినా, మంచి ఆరంభాలు లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతోంది. దీన్ని అధిగమించాల్సి ఉంది. గత కొంత కాలంగా బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్ కావడంతో బ్యాటర్లు సత్తా చాటాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది.