Rishabh Pant: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియాకు మరో షాక్ తగిలింది. మాంచెస్టర్‌ టెస్టులో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ పూర్తిగా సిరీస్‌కు దూరమవుతున్నాడు. ఆయన గాయం తీవ్రమైందని ఆరు వారాలపాటు రెస్ట్‌ కావాలని వైద్యులు చెప్పారు. దీంతో ఆయన ఇంగ్లండ్‌ నుంచి రాక తప్పలేదు.  

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి.ఇందులో రెండు ఇంగ్లండ్ గెలిస్తే ఒకటి టీమిండియా విజయం సాధించింది. ఇప్పుడు మాంచెస్టర్‌లో నాల్గో టెస్టు సాగుతోంది. మొదటి రోజు బ్యాటింగ్ చేస్తున్న టైంలో పంత్ గాయపడ్డాడు. శుభ్‌మాన్ గిల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్, 48 బంతుల్లో 37 పరుగులు చేశారు. ఇన్నింగ్స్‌ పటిష్ట స్థితికి తీసుకెళ్తున్న టైంలో ఆయన కాలికి గాయమైంది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించాడు పంత్. ఆ బంతి పంత్ కాలికి బలంగా తాకింది.  

ఆ దెబ్బకు రిషబ్‌ పంత్‌ విలవిలలాడుతూ కనిపించాడు. అటూ ఇటూ పరిగెత్తి నొప్పిని తట్టుకునే ప్రయత్నం చేశాడు. అయినా నొప్పి తగ్గలేదు. దీంతో మైదానంలో కూలబడిపోయాడు. వెంటనే వైద్యబృందం వచ్చింది. షూ తీసి చూస్తే బంతి తగిలిన చోట వాపు కనిపించింది. ఆ ప్రాంతంలో రక్తం పేరుకుపోయిన విషయం కూడా ఫొటోల్లో కనిపిస్తోంది. 

వైద్య బృందం వచ్చి ప్రాథమి చికిత్స చేసిన తర్వాత కూడా పంత్ కోలుకోలేకపోయాడు. దీంతో అతన్ని ప్రత్యేక వాహనంలో తరలించారు. ఇలా మైదానం వీడిన పంత్‌కు మరిన్ని వైద్య పరీక్షలు చేశారు. గాయం తీవ్రంగా ఉందని పూర్తిగా నయం అయ్యేందుకు ఆరు వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో అతను పూర్తిగా టెస్టు సిరీస్‌ నుంచే వైదొలగుతున్నట్టు అయ్యింది. 

ఈ ఘటన భారత జట్టు కూర్పును మరింత క్లిష్టతరం చేసింది. లార్డ్స్ టెస్ట్‌లో పంత్ చేతి వేలికి గాయంతో కీపింగ్ చేయలేదు. బ్యాటింగ్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో ఆడతాడా లేదా అనే అనుమానం అందరిలో ఉండేది. కానీ అనూహ్యంగా బ్యాటింగ్‌కు దిగాడు. యాక్టివ్‌గా కనిపించాడు. కానీ ఇంతలోనే మరో గాయంతో ఏకంగా టూర్‌ నుంచి తప్పుకోవాల్సి వస్తోంది. 

పంత్ దూకుడు బ్యాటింగ్ జట్టులో ఊపు తీసుకొస్తోంది. స్టంప్స్ వెనుక  అతను అద్భుతాలు చేస్తుంటాడు. ఇప్పుడు ఈ రెండు లోపాలు భారత్‌ ఆట తీరుపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్‌ ఆడనున్నాడు.