Ind Vs Eng Manchestar Test Day 1 Updates: ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియాకు శుభారంభం లభించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన భారత్ .. బుధవారం తొలిరోజు ఆటముగిసేసరికి 83 ఓవర్లలో 4 వికెట్లకు 264 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా (19 బ్యాటింగ్), శార్దూల్ ఠాకూర్ (19 బ్యాటింగ్) ఉన్నారు. వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (151 బంతుల్లో 61, 7 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాచ్ మధ్యలో రిషభ్ పంత్ (37) గాయం కారణంగా రిటైర్డ్ అయ్యాడు. అంతకుముందు ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్, కరుణ్ నాయర్ స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్, సాయిని జట్టులోకి తీసుకుంది. ఇంగ్లాండ్ కూడా ఒక మార్పు చేసింది. గాయపడిన స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో లియామ్ డాసన్ న జట్టులోకి తీసుకుంది.
ఓపెనర్ల శుభారంభం..టాస్ గెలిచిన స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. క్లౌడ్ కవర్ ఉండటంతోపాటు ఆరంభంలో పేసర్లకు పిచ్ బాగా సహకరించింది. అయితే ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46) చక్కని శుభారంభం అందించారు. ఆరంభంలో ఆచి తూచి ఆడుతూ, వీలు దొరికినప్పుడల్లా బౌండరీలు సాధించారు. ముఖ్యంగా రాహుల్ దూకుడుగా ఆడగా, జైస్వాల్ నెమ్మదిగా ఆడాడు. తొలి వికెట్ కు 94 పరుగులు జోడించాక రాహుల్ ఔటయ్యాడు. దీంతో లంచ్ తర్వాత ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో వన్ డౌన్ లో కరుణ్ నాయర్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సుదర్శన్ ఆరంభంలో కాస్త ఒత్తిడిలో కనిపించాడు. చాలా సమయం తీసుకుని, ఆ తర్వాత నెమ్మదిగా పరుగులు సాధించాడు. ఇరవై పరుగుల స్కోరు వద్ద వికెట్ కీపర్ జేమీ స్మిత్ క్యాచ్ వదిలేయడం కూడా సుదర్శన్ కు కలిసి వచ్చింది.
పంత్ కు మళ్లీ గాయం..జైస్వాల్ కెరీర్ లో 12వ అర్ద సెంచరీని పూర్తి చేసుకున్నాక, లియామ్ డాసన్ బౌలింగ్ లో స్లిప్ క్యాచ్ ఔటయ్యాడు. భారత కెప్టెన్ శుభమాన్ గిల్ (12) మరోసారి విఫలమయ్యాడు. ఆ తర్వాత రిషభ్ పంత్ తో కలిసి సుదర్శన్ చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పంత్ చకచకా పరుగులు చేసి, సుదర్శన్ పై ఒత్తిడి తగ్గి, తను కూడా రన్స్ చేశాడు. వీరిద్దరూ వేగంగా ఆడారు. ఈక్రమంలో స్కూప్ షాట్ కు ప్రయత్నించిన పంత్ గాయపడ్డాడు. పాదానికి నేరుగా బంతి తగలడంతో పాదం ఉబ్బి పోయింది. దీంతో తను రిటైర్డ్ గా పెవిలియన్ కి వెళ్లి పోయాడు. ఆ తర్వాత జడేజాతో కలిసి సుదర్శన్ ఇన్నింగ్స్ నడిపించాడు. అయితే కెరీర్ లో తొలి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాక సుదర్శన్ పుల్ షాట్ కు ప్రయత్నించి, ఔటయ్యాడు. ఆఖర్లో అబేధ్యమైన ఐదో వికెట్ కు 29 పరుగులు జోడించిన శార్దూల్-జడేజా మరో వికెట్ పడకుండా రోజును ముగించింది. వెలుతురు మందగించడంతో కాస్త ముందుగానే ఆటను నిలిపేశారు.