Rishabh Pant Accident: డిసెంబర్ 30న టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దిల్లీ నుంచి రూర్కీకి తన తల్లిని కలిసేందుకు వెళ్తుండగా మహ్మద్ పూర్ జాట్ సమీపంలో పంత్ నడుపుతున్న కారు డివైడర్ ను ఢీకొంది. ఢీకొన్న కొద్దిసేపట్లోనే కారులో మంటలు చెలరేగి దహనమైంది. ఈ ప్రమాదం నుంచి పంత్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో పంత్ ను హర్యానా రోడ్ వేస్ బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరమ్ జీత్ లు కాపాడారు. రిషభ్ ప్రాణాలను కాపాడడంలో వారు కీలకపాత్ర పోషించారు. వారు చేసిన పనికి హర్యానా ప్రభుత్వం వారిని సత్కరించింది.
పీటీఐ నివేదిక ప్రకారం.. బస్ డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరమ్ జీత్ లు పానిపట్ కు తిరిగి వచ్చినప్పుడు హర్యానా రోడ్ వేస్ వారిని సత్కరించింది. అభినందన లేఖతోపాటు షీల్డ్ ను వారిద్దరికీ బహూకరించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వారిద్దరినీ గౌరవించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా హర్యానా రోడ్ వేస్ పానిపట్ డిపో జనరల్ మేనేజర్ కుల్దీప్ జాంగ్రా మాట్లాడారు. బస్ డ్రైవర్, కండక్టర్ లకు ప్రశంసా పత్రం, షీల్డ్ ను అందించాం. వారు చేసిన పనికి ఈ గౌరవానికి వారు అర్హులు అని చెప్పారు.
మానవత్వానికి ప్రతీకగా నిలిచారు
పంత్ ను కాపాడిన బస్ డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరమ్ జీత్ లు మానవత్వానికి ప్రతీకగా నిలిచారని హర్యానా రవాణాశాఖ మంత్రి మూల్ చంద్ శర్మ అన్నారు. ప్రమాదంలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా మానవత్వానికి వారు అద్భుతమైన ఉదాహరణగా నిలిచారని ప్రశంసించారు.
మహ్మద్ పూర్ జాట్ సమీపంలో పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది. అప్పుడే హరిద్వార్ నుంచి వస్తున్న బస్ డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరమ్ జీత్ లు తమ బస్సును ఆపి ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే కారు నుంచి సగం బయటకు వచ్చిన పంత్ ను వారు బయటకు తీశారు. నడవడానికి కూడా తీవ్రంగా ఇబ్బందిపడుతున్న పంత్ ను అక్కడినుంచి సురక్షిత స్థలానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది.
ఈ ప్రమాదంలో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని నుదరు, వీపు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పంత్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వీవీఎస్ లక్ష్మణ్ అభినందన
కారు ప్రమాద సమయంలో రిషభ్ పంత్ ను కాపాడిన బస్ డ్రైవర్ సుశీల్ కుమార్ పై.. భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. దగ్ధమైన కారు నుంచి పంత్ ను దూరంగా తీసుకెళ్లి, బెడ్ షీట్ తో చుట్టి, అంబులెన్స్ కు ఫోన్ చేసిన అతనికి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. వారి నిస్వార్థ సేవకు ఎంతో రుణపడి ఉంటామన్నారు.