Ravindra Jadeja Controversy:  నాగ్‌పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఆల్ రౌండర్ జడేజా బంతితో అద్భుతంగా రాణించి 5 వికెట్లు తీశాడు. అయితే తొలి రోజు జడేజా తన వేలికి  ఏదో రాసుకున్నాడనే విషయం చర్చనీయాంశమైంది. అసలు ఏమైందంటే..


ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సులో రవీంద్ర జడేజా 22 ఓవర్లలో 47 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ తక్కువ స్కోరుకు పరిమితమవడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ సందర్బంగా  జడేజా తన వేలికి ఏదో రాసుకోవడం కెమెరాల్లో కనిపించింది. దీనిపై చాలా చర్చ జరిగింది. ఆస్ట్రేలియా మీడియా దీనికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఒక ఆస్ట్రేలియన్ న్యూస్ వెబ్ సైట్ లో ఇలా రాశారు. 'ఆసక్తికరం. భారత్- ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్ సందర్భంగా ఒక ప్రశ్న తలెత్తింది. జడేజా సిరాజ్ వద్దకు వెళ్లి ఏదో అడిగాడు. బౌలింగ్ చేసే ముందు తన ఎడమ చేతి వేలికి ఏదో రాసుకున్నాడు.' అని ఆ కథనం పేర్కొంది. 


దీనిపై ఆ తర్వాత బీసీసీఐ వివరణ ఇచ్చింది. జడేజా వేళ్లకు రాసుకుంది ఆయింట్ మెంట్ అని తెలిపింది. అది నొప్పిని తగ్గించే ఆయింట్ మెంట్ అని.. పెయిన్ ను తగ్గించుకోవడానికి జడేజా అది వేళ్లకు రాసుకున్నాడని స్పష్టం చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధం ఏం కాదని తెలిపింది. 






రవీంద్రజాలం


ఇకపోతే తొలిరోజు మ్యాచ్ లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విజృంభించాడు. దాదాపు 5 నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జడ్డూ.. పునరాగమనం చేసిన తొలి మ్యాచ్ లోనే 5 వికెట్లు పడగొట్టి వహ్వా అనిపించాడు. ప్రపంచ నెం. 1 ఆల్ రౌండర్ అయిన జడేజా స్పిన్ మాయాజాలానికి ఆస్ట్రేలియా విలవిల్లాడింది. ఆసీస్ బ్యాటర్లు మార్నస్ లబూషేన్, రెన్ షా, స్టీవెన్ స్మిత్, హ్యాండ్స్ కాంబ్, ముర్ఫీలను జడేజా ఔట్ చేశాడు. ఇందులో స్మిత్ ను జడేజా బౌల్డ్ చేసిన తీరు ఈ ఇన్నింగ్స్ కే హైలైట్ అనేలా ఉంది.


జడేజా స్టన్నర్ బాల్ 


ఇన్నింగ్స్ 42వ ఓవర్ చివరి బంతికి స్టీవ్ స్మిత్ ను జడేజా బౌల్డ్ చేశాడు. అప్పటికి 37 పరుగులు చేసిన స్మిత్ మంచి టచ్ లో కనిపించాడు. జడ్డూ విసిరిన బంతి నేరుగా వచ్చి స్మిత్ డిఫెన్స్ ను ఛేదిస్తూ ఆఫ్ స్టంప్ ను గిరాటేసింది. తను ఔటైన తీరును స్మిత్ నమ్మలేకపోయాడు. ఒక్క క్షణంపాటు అలాగే చూస్తుండిపోయాడు. కామెంట్రీ బాక్సులో ఉన్న రవిశాస్త్రి సైతం ఆ బంతిని ఆబ్సల్యూట్ బ్యూటీ అంటూ పొగిడాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.