KS Bharat: కేఎస్ భరత్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు తుది జట్టులో భరత్ కు స్థానం లభించింది. ఇండియా- ఏ తరఫున నిలకడగా రాణించిన భరత్ అంతర్జాతీయ మ్యాచ్ లోనూ అదే ప్రదర్శన కొనసాగించాలని కోరుకుంటున్నాడు.
స్వదేశంలో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ లో టెస్ట్ క్యాప్ అందుకున్న కేఎస్ భరత్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సహచరుల అభినందనలతో టీమిండియా క్యాప్ అందుకుని ఉద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ ట్విట్టర్ లో షేర్ చేసింది. వికెట్ కీపర్ గా భరత్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
సీఎం జగన్ అభినందనలు
బోర్డర్- గావస్కర్ సిరీస్ తో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ కు ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలిపారు. టీమిండియా తరఫున రాణించాలని ఆకాంక్షించారు. తెలుగు ఖ్యాతిని భరత్ ఇనుమడింపజేశారని ప్రశంసించారు.
దీనిపై కేఎస్ భరత్ స్పందించాడు. 'మీ అభిమానాన్ని, ఆశీస్సులను అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పుడూ కష్టపడి ఆడుతూ దేశానికి, తెలుగు వారికి మంచి పేరు తీసుకువచ్చేలా కృషిచేస్తాను' అని సీఎం ట్వీట్ కు భరత్ జవాబిచ్చాడు.
నారా లోకేష్ అభినందనలు
టీమిండియా టెస్టు జట్టులో స్థానం సంపాదించిన తెలుగు క్రికెటర్ కేఎస్ భారత్ కు.. తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ అభినందనలు తెలిపారు. దేశానికి సుదీర్ఘకాలం సేవలు అందించాలని ఆకాక్షించారు. అలానే విజయవంతమైన కెరీర్ ను కలిగి ఉండాలని కోరుకున్నారు.
నా ఆట నన్ను ఆడమని చెప్పారు
'ఇక్కడికి చేరుకోవడానికి ముందు నేను 2018లో ఇండియా-ఎ తరఫున అరంగేట్రం చేశాను. అప్పుడు రాహుల్ ద్రవిడ్ సార్ ఆ జట్టుకు కోచ్‌గా ఉన్నారు. నా ప్రయాణం ఎప్పుడూ నిదానంగా సాగుతుంది. నేను ఇంగ్లండ్‌లో ఇండియా ఎ తరఫున ఆడినప్పుడు ద్రవిడ్ సార్ తో చాలా చర్చించాను. నా ఆటను తదుపరి స్థాయికి ఎలా తీసుకెళ్లాలో రాహుల్ సార్ ను అడిగాను. 'నువ్వు బాగానే ఆడుతున్నావు. ఇప్పుడెలా ఆడుతున్నావో దాన్నే కొనసాగించు అని ద్రవిడ్ సర్ అన్నారు.' అని భరత్ గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నారు.
దాదాపు ఏడాదిన్నరగా టెస్టు స్క్వాడ్ లో కేఎస్ భరత్ ఉంటున్నాడు. అయితే తుది జట్టులో మాత్రం అతనకి చోటు దక్కలేదు. ఇప్పుడు రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రమాదంలో గాయపడి జట్టుకు దూరమవటంతో భరత్ కు స్థానం లభించింది. ఇషాన్ కిషన్ పోటీలో ఉన్నప్పటికీ కోచ్, కెప్టెన్ భరత్ కే ఓటేశారు.