Rohit Sharma, Virat Kohli Latest Updates: వన్డే ప్రపంచకప్ మరో రెండేళ్లలో జరుగనుంది. భారత వెటరన్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. అప్పటివరకు ఆడగలరా..? అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. ముఖ్యంగా టెస్టులు, టీ20లకు దూరమైన ఈ ఇద్దరు ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్ లో ఆడుతున్నారు. ఈక్రమంలో అప్పటివరకు వీరు సెలెక్షన్ రాడార్ లో ఉండాలంటే ఏం చేయాలో మాజీ కోచ్, రవి శాస్త్రి తెలిపాడు. రాబోయే ఆస్ట్రేలియా సిరీస్ వీళ్లకో అగ్ని పరీక్షలాంటిదని, ఇందులోసత్తా చాటితే ఎలాంటి అనుమానాలు ఉండబోవని పేర్కొన్నాడు.
ప్రస్తుతం 36వ పడిలో ఉన్న కోహ్లీ, 38వ పడిలో ఉన్న రోహిత్.. ప్రపంచకప్ వరకల్లా వరుసగా 38, 40వ ఏజ్ లోకి చేరుకుంటారు. ఆ ఏజ్ లో వాళ్లు రాణించాలంటే ఇప్పటి నుంచే దానికి తగినట్లుగా ఎప్పటికప్పుడు సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వన్డేలను చాలా జట్లు లిమిటెడ్ గా ఆడుతున్నాయి. ఈ క్రమంలో ఒకే ఫార్మాట్ లో ఉంటూ, ఫామ్, ఫిట్ నెస్ కాపాడుకోవడం సవాలుతో కూడుకున్నదే.
19 నుంచి సిరీస్..ఈనెల 19 నుంచి ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. దాదాపు 7 నెలల తర్వాత రోకో ద్వయం అంతర్జాతీయంగా మ్యాచ్ ఆడనుంది. చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో వీరిద్దరూ ఆడారు. ఫైనల్లో రోహిత్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోగా, టాప్-5 లీడింగ్ రన్ స్కోరర్స్ లో కోహ్లీ నిలిచాడు. మళ్లీ అలాంటి ప్రదర్శననే టీమిండియా కోరుకుంటుంది. దీంతో ఆసీస్ టూర్లో వీరిద్దరూ సత్తా చాటాలని, అప్పుడే ప్రపంచకప్ లో వీరి స్థానంపై సందేహాలు రావని శాస్త్రి పేర్కొన్నాడు. ఇక తమ ఆటతీరుపై వాళ్లకు సరైన అవగాహన ఉందని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపాడు. ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ కూడా ఇలాగే వన్డేలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నాడని, రోకో ద్వయం కూడా సమయానకి తగిన విధంగా వ్యవహరిస్తాడని పేర్కొన్నాడు.
నో ఫికర్..ఇక లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు తిరుగులేని ఆటగాళ్లు ఉన్నారని శాస్త్రి పేర్కొన్నాడు. ముఖ్యంగా దేశంలో ప్రతిభ గల ఆటగాళ్లకు కొదువ లేదని, వైట్ బాల్ క్రికెట్లో చాలా బాగా ఆడుతున్నారని ప్రశంసించాడు. ఇటీవల ఆసియాకప్ ఫైనల్లో అద్భుత ప్రతిభ చాటిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న పరిస్థితుల్లో చాలా అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు.
ఇక యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్ లాంటి ప్రతిభావంతమైన ఆటగాళ్లతో వైట్ బాల్ క్రికెట్లో టీమిండియా దుర్బేధ్యంగా ఉందని తెలిపాడు. రాబోయే ఆసీస్ సిరీస్ పోటాపోటీగా జరుగనుందని తెలిపాడు. మరోవైపు ఇప్పటికే టెస్టు కెప్టెన్ గా ఎంపికైన గిల్.. తాజాగా వన్డే కెప్టెన్ గానూ ప్రమోషన్ పొందాడు. ఆసీస్ సిరీస్ తో తను వైట్ బాల్ కెప్టెన్ గానూ పగ్గాలు చేపట్టనున్నాడు. గత జూన్ లో ఇంగ్లాండ్ పర్యటనలో తొలిసారి టెస్టు కెప్టెన్ గా గిల్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.