Ind Vs WI 2nd Test  Latest Updates:  హైద‌రాబాదీ ఏస్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ టెస్టుల్లో అరుదైన ఘ‌న‌త‌ను ద‌క్కించుకున్నాడు. ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్ గా నిలిచాడు. సోమ‌వారం నాలుగో రోజు వెస్టిండీస్ బ్యాట‌ర్ షాయ్ హోప్ వికెట్ ను తీసిన అనంత‌రం ఈ ఏడాది లీడింగ్ వికెట్ టేక‌ర్ గా నిలిచాడు. ఓవ‌రాల్ గా ఈ ఏడాది 8 మ్యాచ్ లు ఆడిన సిరాజ్.. 1575 బంతులు వేశాడు. ర‌ఫ్ గా చెప్పాలంటే 262.3 ఓవ‌ర్ల‌ను నిల‌క‌డ‌గా బౌలింగ్ చేశాడు. మొత్తంమీద 37 వికెట్ల‌ను తీశాడు. అత‌ని స‌గ‌టు 26.91 కావ‌డం విశేషం. ఓవ‌రాల్ గా త‌ను ఈ ఏడాది టెస్టుల్లో 39 మెయిడిన్లు వేశాడు. అలాగే 996 ప‌రుగుల‌ను స‌మ‌ర్పించుకున్నాడు. త‌న అత్యుత్త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న 6-70 కావ‌డం విశేషం. ఇక 42.56 స్ట్రైక్ రేట్ తో 3.79 ఎకాన‌మీ రేటుతో త‌ను బౌలింగ్ చేశాడు. ఓవ‌రాల్ గా త‌న ఖాతాలో రెండు నాలుగు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌, రెండు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న ఉన్నాయి. 

Continues below advertisement

రెండోస్థానంలో..వెస్టిండీస్ తో రెండో టెస్టు కుముందు 36 వికెట్ల‌తో జింబాబ్వే పేస‌ర్ బ్లెస్సింగ్ ముజ‌ర‌బానీ నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్నాడు. త‌ను ఈ ఏడాది 9 మ్యాచ్ లు ఆడి, 276.4 ఓవ‌ర్లు వేశాడు. స‌గ‌టు 28.63 కాగా, 47 మెయిడిన్ల‌ను వేశాడు. ఇక వెస్టిండీస్ తో జ‌రుగుతున్న రెండో టెస్టు ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ ను కొన‌సాగించిన వెస్టిండీస్ సోమ‌వారం నాలుగో రోజు 118.5 ఓవ‌ర్ల‌లో 390 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. దీంతో భార‌త్ ముందు 121 ప‌రుగుల టార్గెట్ ను నిర్దేశించింది. 

సెంచరీల‌తో స‌త్తా..ఇక ఈ మ్యాచ్ లో నాలుగో రోజు బ్యాటింగ్ చేసి, ఓపెనర్ జాన్ క్యాంబెల్ (199 బంతుల్లో 115, 12 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), షాయ్ హోప్ (214 బంతుల్లో 103, 12 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) సెంచ‌రీల‌తో స‌త్తా చాటారు. మూడో వికెట్ కు వీరిద్ద‌రూ క‌లిసి 177 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. దీంతో టీమిండియా ముందు 100+ ర‌న్స్ టార్గెట్ ఉంచ‌గ‌లిగింది. బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్, జ‌స్ ప్రీత్ బుమ్రాకు మూడేసి వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేజింగ్ ప్రారంభించిన భార‌త్.. ఆట‌ముగిసేస‌రికి 18 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 63 ప‌రుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ సెంచ‌రీ హీరో య‌శ‌స్వి జైస్వాల్ (8) త్వ‌ర‌గా ఔట‌వ‌గా, మ‌రో ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (25 బ్యాటింగ్), వ‌న్ డౌన్ బ్యాట‌ర్ సాయి సుద‌ర్శ‌న్ (30 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంకా విజయానికి భార‌త్ కు 58 ప‌రుగులు కావాలి. తొలి టెస్టును ఇన్నింగ్స్ 140 ప‌రుగుల తేడాతో గెలిచిన భార‌త్.. రెండు టెస్టుల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ కు మంగ‌ళ‌వారం ఆఖరిరోజు. దాదాపు లంచ్ విరామం లోప‌లే ఈ మ్యాచ్ ఫ‌లితం తేలే అవకాశం ఉంది. ఇక తొలి ఇన్నింగ్స్ ను భారత్ 5 వికెట్లకు 518 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జైస్వాల్ (175) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరోవైపు తమ తొలి ఇన్నింగ్స్ లో విండీస్ 248 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 270 పరుగుల లీడ్ ఇండియాకు దక్కింది. 

Continues below advertisement