Team India Bowler Ravi Bishnoi: టీమిండియా యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్ ఐసీసీ టీ 20 ర్యాంకుల్లో సత్తా చాటాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో నంబర్‌వన్ బౌలర్‌ (World No1 T20I bowler)గా నిలిచి చరిత్ర సృష్టించాడు. గత వారం ఐసీసీ టీ 20 ర్యాంకుల్లోఐదో స్థానంలో నిలిచిన బిష్ణోయ్‌.. అఫ్గాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. 699 పాయింట్లతో రవి బిష్ణోయ్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో రవి బిష్ణోయ్ ఐదు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.  రెండో స్థానానికి పడిపోయిన ఆప్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ఖాతాలో 692 పాయింట్లు ఉన్నాయి. 679 పాయింట్లతో శ్రీలంక బౌలర్ హసరంగ, ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. శ్రీలంక బౌలర్ మహీష్ తీక్షణ 677 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్‌ శామ్ కరణ్ ఆరు, పాకిస్థాన్‌ బౌలర్‌ ఫజల్లా ఫారుఖీ ఏడు.. మరో అఫ్గాన్‌ బౌలర్‌ ముజీబుర్ రెహ్మాన్ ఎనిమిది.. వెస్టిండీస్‌ బౌలర్‌ ఆకీల్ హుస్సేన్ తొమ్మిది, దక్షిణాఫ్రికా బౌలర్‌ అన్రిచ్ నోకియా పదో స్థానంలో ఉన్నారు.


టీ20ల్లో బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మహ్మద్ రిజ్వాన్ రెండో స్థానంలో, ఐడెన్ మార్‌క్రమ్  మూడో స్థానంలో ఉన్నారు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో 223 పరుగులు చేసిన రుతురాజ్‌ గైక్వాడ్  ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ అల్ హసన్ మొదటి స్థానంలో ఉన్నాడు. అఫ్గానిస్థాన్‌ ప్లేయర్ మహ్మద్‌ నబీ రెండో స్థానంలో ఉండగా హార్దిక్‌ పాండ్యా మూడో స్థానంలో ఉన్నాడు.  జట్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. మూడు ఫార్మాట్లలోనూ టీమ్ఇండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.


భారత పర్యటనను ఆస్ట్రేలియా ఓటమితో ముగించింది. నామామాత్రమైన అయిదో టీ ట్వంటీలోనూ పరాజయం పాలైంది. ఆసిస్‌ ఓటమితో అయిదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను 4-1తో యువ భారత్‌ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 154 పరుగులకే పరిమితమైంది. ఇప్పటికే అయిదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంది.


ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్‌ ముగించుకున్న టీమిండియా... మరికొన్ని రోజుల్లో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. డిపెంబరు 10 నుంచి టీ20 సిరీస్, డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్నాయి. ఆ తర్వాత రెండు టెస్టులు జరగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం భారత సెలక్టర్లు ఇప్పటికే జట్లను ప్రకటించగా తాజాగా దక్షిణాఫ్రికా కూడా జట్లను ప్రకటించింది. ప్రపంచకప్‌లో తీవ్రంగా నిరాశపర్చిన కెప్టెన్ తెంబా బావుమాను కెప్టెన్‌ పదవి నుంచే కాక టీ20, వన్డే సిరీస్‌ల నుంచి తప్పించారు. అతడి స్థానంలో ఐడెన్ మార్‌క్రమ్‌కు కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించారు. రబాడాకు కూడా జట్టులో స్థానం దక్కలేదు.


దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా టీ20జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.