Afghanistan T20I Captain:  అఫ్ఘనిస్థాన్ టీ20 ఫార్మాట్ కెప్టెన్ గా స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ నియమితుడయ్యాడు. మహమ్మద్ నబీ స్థానంలో అఫ్ఘాన్ క్రికెట్ యాజమాన్యం రషీద్ కు పగ్గాలు అప్పగించింది. 2022 టీ20 ప్రపంచకప్ లో ఆ జట్టు వైఫల్యం తర్వాత నబీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 


రషీద్ ఖాన్- అఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడు. స్టార్ బౌలర్. రషీద్ కు కెప్టెన్సీ చేయడం కొత్తకాదు. అంతకుముందు కూడా అతను అఫ్ఘాన్ జట్టును నడిపించాడు. 24 ఏళ్ల రషీద్ ఖాన్ 2019 సెప్టెంబర్, నవబంర్ మధ్య 3 నెలలపాటు జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో 7 టీ20ల్లో అప్ఘాన్ 4 విజయాలు నమోదు చేసింది. మొత్తం అన్ని ఫార్మాట్లలో కలిపి జట్టుకు 16 మ్యాచుల్లో 7 విజయాలు అందించాడు రషీద్. 2021లో టీ20 ప్రపంచకప్ నకు కూడా అఫ్ఘనిస్థాన్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అయితే టోర్నీ ప్రారంభమయ్యే ఒక నెల ముందు, రషీద్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. జట్టును ఎంపిక చేయడంలో సెలక్షన్ కమిటీ, ఏసీబీ తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంలేదని అప్పట్లో రషీద్ చెప్పాడు. దాని తర్వాత మహమ్మద్ నబీ కెప్టెన్ గా వ్యవహరించాడు. 


రషీద్ జట్టును సమర్ధవంతంగా నడిపించగలడు


'రషీద్ కు ఈ పాత్ర కొత్త కాదు. అంతకుముందు అన్ని ఫార్మాట్లలోనూ జట్టును నడిపించాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్ లు ఆడిన అనుభవం అతనికి ఉంది. ఇది అఫ్ఘనిస్థాన్ జట్టును కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది.' అని అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మిర్వాయిస్ అష్రఫ్ అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అఫ్ఘనిస్థాన్ యూఏఈలో పర్యటించనుంది. అక్కడ 3 టీ20 మ్యాచ్ లు ఆడబోతోంది. ఈ సిరీస్ నుంచే రషీద్ ఖాన్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. 


దేశం గర్వపడేలా ఆడతాం


అఫ్ఘనిస్థాన్ జట్టుకు కెప్టెన్ గా తనను ప్రకటించిన తర్వాత రషీద్ ఖాన్ మాట్లాడాడు. 'కెప్టెన్సీ అనేది చాలా పెద్ద బాధ్యత. ఇంతకుముందు దేశానికి నాయకత్వం వహించిన అనుభవముంది. అలాగే జట్టుపై మంచి అవగాహన ఉంది. జట్టంతా కలిసి ఉండడానికి మేం ప్రయత్నిస్తాం. అలాగే దేశం గర్వపడేలా ఆడడానికి కృషి చేస్తాం' అని ఈ స్టార్ బౌలర్ అన్నాడు.